తమన్ ఇలా మారిపోయాడేంటి..?

Sun Jan 21 2018 21:00:01 GMT+0530 (IST)

తెలుగులో చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు తమన్. తెలుగులో తొలి సినిమానే రవితేజ లాంటి స్టార్ హీరోతో చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో అతను మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. పెద్ద హీరోల సినిమాలకు పని చేశాడు. చాలా వేగంగా 50 సినిమాల మైలురాయిని కూడా అందుకున్నాడు. కానీ పెద్ద పెద్ద సినిమాలైతే చేశాడు కానీ.. రొటీన్ గా వాయించేస్తాడని.. అతడి సంగీతంలో మోత ఎక్కువని.. పాట వినిపించదని.. ముఖ్యంగా మెలోడీలు చేయలేడని.. విమర్శలున్నాయి. ఐతే ఈ మధ్య తమన్ లో మార్పు కనిపిస్తోంది.గత ఏడాది తమన్ చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆడియోలు మాత్రం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మహానుభావుడు’ సినిమాలో కొత్త తమన్ కనిపించాడు. కొత్తగా అనిపించే.. శ్రావ్యమైన పాటలతో అతను సంగీత ప్రియుల మనసు దోచాడు. అందులో మెలోడీలు సూపర్ హిట్టయ్యాయి. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇదే కాక ‘విన్నర్’.. ‘జవాన్’ లాంటి సినిమాల ఆడియోలకు కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘తొలి ప్రేమ’తో తమన్ మరోసారి సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాడు. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు సంగీతం చాలా కీలకం. తమన్ తన వంతుగా పాటలతో సినిమాకు ప్రాణం పోయడానికి ప్రయత్నించాడని ఈ ఆడియో వింటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇందులో ‘నిన్నిలా’.. ‘సునోనా సునైనా’ పాటలు ఇన్ స్టంట్ గా హిట్టయిపోయాయి. మిగతా పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఆల్బంకు మంచి స్పందన వస్తోంది. ఆ మధ్య ఒక ఆడియో వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. తమన్ ఈ మధ్య రూటు మార్చాడని.. చాలా మంచి మ్యూజిక్ ఇస్తున్నాడని.. అతను ఇలాగే కంటిన్యూ చేయాలని అన్నాడు. నిజంగానే తమన్ ఆ మాట ప్రకారం సాగిపోతుండటం మంచి విషయమే.