Begin typing your search above and press return to search.

ఇక్కడ.. అక్కడ.. ఎక్కడ చూసినా తమనే

By:  Tupaki Desk   |   12 March 2018 4:00 AM GMT
ఇక్కడ.. అక్కడ.. ఎక్కడ చూసినా తమనే
X
కొత్త ఏడాదిలో తమన్ ఊపు మామమూలుగా లేదు. ఫిబ్రవరి 9న తెలుగులో మూడు సినిమాలు రిలీజైతే ఆ మూడింటికీ తమనే సంగీతాన్నందించాడు. దాని కంటే ముందు వచ్చిన ‘భాగమతి’కీ అతనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ముందు సంక్రాంతికి తమిళంలో ‘స్కెచ్’ సినిమాతో పలకరించాడు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘చల్ మోహన రంగ’కు అతనే సంగీత దర్శకుడు. ఈ సినిమా పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇలాంటి తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికవడం అతడి కెరీర్ కు ఒక మేలి మలుపుగా భావిస్తున్నారు. ఇది కాక తమిళంలో మరో సినిమా చేస్తున్నాడు తమన్.

తాజాగా అతడికి కన్నడలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు పని చేసే అవకాశం దక్కింది. శాండిల్ వుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన గణేష్ సినిమాకు తమన్ సంగీతాన్నందించనున్నాడు. గత ఏడాది తమన్ ‘గోల్ మాల్-3’తో బాలీవుడ్ అరంగేట్రం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలో నాలుగు భాషల్లో సినిమాలు చేయడమంటే మాటలు కాదు. నిజానికి ‘భాగమతి’తో తమన్ మలయాళ ప్రేక్షకుల్ని కూడా పలకరించాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో ఐదు భాషల్లో సందడి చేశాడన్నమాట తమన్. ఇండియాలో ఇలాంటి సంగీత దర్శకుడు ప్రస్తుతం మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య తమన్ సంగీతంలో క్వాలిటీ కూడా కనిపిస్తుండటం.. అతడి సంగీతానికి ఎన్నడూ లేనంత అప్లాజ్ వస్తుండటమూ విశేషం.