Begin typing your search above and press return to search.

థమన్ షో ట్రెండ్ సెట్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   21 March 2019 10:21 AM GMT
థమన్ షో ట్రెండ్ సెట్ చేస్తుందా?
X
టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ థమన్ 'సూపర్ సింగర్' షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మాటీవీ లో ఈ నెల 23 నుండి ప్రసారం కానున్న ఈ సింగర్స్ బేస్డ్ షోలో థమన్ జడ్జిగా వ్యవరిస్తే సింగర్ రేవంత్.. నటి హరితేజ ఇద్దరూ కలిసి షోను హోస్ట్ చేస్తారు. ఈ షో ప్రసారం కాకమునుపే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మనకు తెలుగులో సింగింగ్ కాంటెస్టులలో దాదాపుగా సింగర్లే జడ్జిగా ఉంటారు. ఇక డ్యాన్స్ షోల విషయం తీసుకుంటే కొరియోగ్రాఫర్లు జడ్జీలుగా వ్యవహరిస్తారు. కానీ ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ జడ్జిగా.. నటి- సింగర్లు హోస్టులుగా కార్యక్రమాన్ని డిజైన్ చేయడం కొత్త ట్రెండ్ అని చెప్పుకోవాలి. నిజానికి ఇలాంటి ట్రెండ్ హిందీ టీవీ రంగంలో ఎప్పటి నుంచో ఉంది. అక్కడ డ్యాన్స్ షో అయినా.. మ్యూజిక్ షో అయినా జడ్జిలు దానికి సంబంధించిన వారు మాత్రమే ఉండరు. కొన్ని సందర్భాలలో డైరెక్టర్లు.. నటులు.. సంగీత దర్శకులు కూడా జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు మాటీవీ వారు సరిగ్గా అదే ట్రెండ్ ను ఇక్కడ మొదలు పెట్టబోతున్నారన్నమాట.

ఒకవేళ ఈ షో క్లిక్ అయిన పక్షంలో ఇక డ్యాన్స్ షో అంటే కొరియోగ్రాఫర్లే ఉంటారు.. సింగింగ్ కాంపిటీషన్ అంటే సింగర్లే ఉంటారు అనే అభిప్రాయానికి కాలం చెల్లినట్టే. అన్నిషోలలో అందరూ ఉంటారన్నమాట. షో ఆర్గనైజర్లు కనక సంబంధిత రంగం గురించి.. ఆ కళ గురించి అవగాహన ఉన్నవారిని కనుక జడ్జిలుగా.. హోస్టులుగా ఎంపిక చేయకపోతే ఇది కొత్త చర్చలకు కూడా దారితీయవచ్చు. ఎందుకంటే సింగర్లకు లెజెండరీ సింగర్లు మార్కులేస్తేనే వారిపై "తకిట తకిట 2-4 ..నువ్వేమో 6-8" అని ఇన్ డైరెక్ట్ పంచులు వేసే లోకం మనది. ఇక ఆ కళతో సంబంధం లేనివాళ్ళు మార్కులేస్తే ఎలా ఉంటుందో ఏంటో.