తమన్ మోత మోగించేస్తున్నాడుగా..

Tue Oct 23 2018 21:00:01 GMT+0530 (IST)

నెల కిందట ఇదే సమయానికి తమన్ అనవసర వివాదాల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ‘అరవింద సమేత’ పాటలు కాపీ అంటూ అతడి మీద విమర్శలు వచ్చాయి. ఇందులోని పాటలకు.. వేరే పాటలకు పోలికలు చూపిస్తూ.. మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో జనాలు తమన్ ను ఆటాడుకున్నారు. ఈ విమర్శలకు తమన్ బదులిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఐతే ‘అరవింద సమేత’ సినిమా చూశాక మాత్రం అందరి నోళ్లూ మూతపడ్డాయి. ఈ చిత్రానికి అదిరిపోయే నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు తమన్. ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సన్నివేశాల్ని భలేగా ఎలివేట్ చేశాడతను. సినిమాలో కీలకమైన సీన్లన్నింట్లోనూ నేపథ్య సంగీతం అదిరిపోయింది.ఈ సినిమా బీజీఎంకు ఏ స్థాయిలో పేరొచ్చిందంటే.. ఈ ట్రాక్స్ అన్నింటినీ ఇప్పుడు యూట్యూబ్ లో సైతం రిలీజ్ చేశాడు తమన్. దీని కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించడంతో చిత్ర బృందం బీజీఎం ట్రాక్స్ తో ప్రత్యేకంగా జ్యూక్ బాక్స్ రెడీ చేసింది. నిన్న సాయంత్రం తమన్ జ్యూక్ బాక్స్ వదిలాడు. అరగంటకు పైగా నిడివితో ఈ జ్యూక్ బాక్స్ ఉంది. సినిమాలో ఇన్వాల్వ్ అయినపుడు నేపథ్య సంగీతం ప్రత్యేకతను గుర్తించలేకపోయిన వాళ్లు.. ఈ ట్రాక్స్ విని ఔరా అనుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్.. ఎమోషన్ సీన్లలో బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. తమన్ ‘అరవింద సమేత’ కోసం ఎంత కష్టపడ్డాడు.. ఎంత శ్రద్ధ పెట్టాడు అన్నది ఈ బీజీఎం ట్రాక్స్ వింటే అర్థమవుతుంది. తమన్ గత సినిమాలకు భిన్నంగా.. చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి ఈ ట్రాక్స్ అన్నీ. ఇలా బీజీఎం ట్రాక్స్ రిలీజ్ చేసి.. వాటికీ ప్రశంసలందుకోవడం తమన్ కే చెల్లింది.