పవర్ స్టార్ కి బోనీకపూర్ భారీ ఆఫర్!

Sun Sep 22 2019 21:09:54 GMT+0530 (IST)

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్- తాప్సీ ప్రధాన తారాగణంగా నటించిన `పింక్` చిత్ర రీమేక్ హక్కుల్ని శ్రీదేవి భర్త  స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీదేవి కోరిక మేరకు ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా `నేర్కొండ పార్వై` పేరుతో రీమేక్ చేశారు. అజిత్ కి జోడీగా విద్యాబాలన్ నటించి ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అజిత్ నటనకు కోలీవుడ్ మొత్తం ప్రశంసల వర్షాన్ని కురిపించింది. ఆ స్థాయిలో అజిత్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. `ఖాకీ` ఫేమ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ చిత్రంలో నటించమని టాలీవుడ్ క్రేజీ స్టార్స్ కు నిర్మాత బోనీ కపూర్ భారీ ఆఫర్ ఇచ్చారని తెలిసింది. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రని తమిళంలో అజిత్ అత్యద్భుతంగా రక్తి కట్టించారు. దీంతో తెలుగు రీమేక్ లో ఆ పాత్రని అదే స్థాయి నటుడి చేత చేయించాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన బోనీ కపూర్ ఇద్దరు హీరోల దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు ఒకరు బాలకృష్ణ.. మరొకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే బాలకృష్ణని బోనీ సంప్రదించారని ఆయన ఈ కథలో నటించడానికి ఆసక్తిగా వున్నారని తెలుస్తోంది. అయితే ఇతర ప్రాజెక్టులతో బిజీగా వుండటం వల్ల `పింక్` రీమేక్ ఆలస్యం అయ్యే అవాకాశాలు వుండటంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని సంప్రదించారట.

క్రియాశీల రాజకీయాల్లో బిజీ అయిన పవన్ సినిమాలకు ఇక బ్రేక్ ఇచ్చినట్టే అని ప్రచారం జరిగింది. అయితే ఆయన మళ్లీ సినిమాల్లో నటించడానికి సుముఖంగా వున్నారని తనకు తగ్గ కథ కుదిరితే దానికి సామాజిక బాధ్యత వుంటే తప్పకుండా సినిమా చేస్తానని పవన్  ఆసక్తిగా వున్నారని ప్రచారమవుతోంది. ఈ విషయం తెలిసిన బోనీ పవన్ ని సంప్రదించి ఈ సమయంలో తనకు ఇది కరెక్ట్ స్క్రిప్ట్ అని కన్విన్స్ చేస్తున్నారట. మరి ఈ ఇద్దరిలో `పింక్` రీమేక్ ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. బోనీ ఇస్తున్న ఆఫర్ ని బాలయ్య సొంతం చేసుకుంటాడా? లేక పవన్ చేజిక్కించుకుంటాడా? అన్నది వేచి చూడాల్సిందే.