Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: సూర్య సూపరున్నాడు

By:  Tupaki Desk   |   23 July 2017 7:45 AM GMT
ఫస్ట్ లుక్: సూర్య సూపరున్నాడు
X
దక్షిణాదిన ఉన్న అత్యంత అందమైన హీరోల్లో తమిళ స్టార్ సూర్య ఒకడు. అతడికి అమ్మాయిల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం తమిళులే కాదు.. తెలుగు వాళ్లు కూడా సూర్యను చాలా ఇష్టపడతారు. అందానికి అందం.. నటనకు నటన.. దీనికి తోడు అణకువల అతణ్ని మన జనాలకు బాగా చేరువ చేశాయి. అందుకే కొన్నేళ్లుగా సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ మధ్య రిలీజవుతున్నాయి. తమిళంతో సమానంగా ఆదరణ పొందుతున్నాయి. గత ఏడాది వచ్చిన ‘24’.. ఈ ఏడాది రిలీజైన ‘సింగం-3’ తమిళంతో దీటుగా ఇక్కడ వసూళ్లు రాబట్టాయి. త్వరలోనే సూర్య ఓ కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. అదే.. ‘తానా సేంద కూట్టం’.

ఆదివారం సూర్య పుట్టిన రోజు నేపథ్యంలో ‘తానా సేంద కూట్టం’ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది. గత కొన్నేళ్లలో లుక్ విషయంలో రకరకాల ప్రయోగాలు చేసిన సూర్య.. ఈ సినిమా కోసం నార్మల్ లుక్‌ లోకి వచ్చాడు. ఆ నార్మల్ లుక్కే అదుర్స్ అనిపిస్తోంది. ‘నానుమ్ రౌడీ దా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విఘ్నేష్ శివన్ (నయనతార బాయ్ ఫ్రెండ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ‘తానా సేంద కూట్టం’ బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ ‘స్పెషల్ చబ్బీస్’కు రీమేక్ కావడం విశేషం. ఐతే సౌత్ నేటివిటీకి తగ్గట్లుగా దీన్ని చాలా మార్చేసినట్లు చెబుతున్నారు. ‘స్పెషల్ చబ్బీస్’ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి ఒకప్పుడు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఫలించలేదు. తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు కాబట్టి.. అది ఆటోమేటిగ్గా తెలుగులోనూ పెద్ద స్థాయిలోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తెలుగు రీమేక్ కథ ముగిసినట్లే. త్వరలోనే తెలుగు వెర్షన్ టైటిల్ ప్రకటించనున్నారు.