Begin typing your search above and press return to search.

బాహుబలిపై లాస్ట్ పంచ్ మన డైరెక్టర్లదేనా?

By:  Tupaki Desk   |   24 July 2015 6:23 AM GMT
బాహుబలిపై లాస్ట్ పంచ్ మన డైరెక్టర్లదేనా?
X
బాహుబలితో జక్కన్న దర్శకుడిగా చాలా మెట్లు ఎక్కేశాడు. అన్ని భాషల్లోని రికార్డులన్నిటినీ తిరగరాసేశాడు కూడా. మూడేళ్లపాటు కష్టపడి రాజమౌళి సృష్టించిన ఈ మూవీ సృష్టించిన రికార్డులన్నీ చెప్పాలంటే... మరో 3గంటల సినిమా తీయాల్సొస్తుంది. అంతటి చరిత్రకి సృష్టికర్త అయిన రాజమౌళి, సౌత్ సినిమా అంటే తమిళ్ మూవీస్ అనే ఫీలింగ్‌ ని కూడా కడిగిపారేశాడు.

జక్కన్న చెక్కిన ఈ దృశ్యకావ్యానికి ప్రపంచమే ఫిదా అయిపోతోంది. ఇంటా, బయటా అనేకమంది స్టార్ల నుంచి అందుతున్న ప్రశంసలతో మన దర్శకధీరుడు ఫుల్ హ్యాపీ. అమితాబ్ వంటి ఇండియన్ సూపర్ స్టార్ నుంచి మన మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్‌ బాబు, రామ్‌ చరణ్... ఇలా అందరు నటులు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పారు. బాహుబలికి సాహో అన్నారు కూడా. నటులే కాదు డైరెక్టర్లు కూడా జక్కన్న వర్క్‌ ని ఓపెన్‌ గానే పొగుడుతున్నారు. పలువురు హిందీ దర్శకులతోపాటు... దక్షిణాది సినిమాలను నార్త్‌ కి తీసుకెళ్లిన డైరెక్టర్ల లో ప్రముఖుడైన శంకర్ కూడా రాజమౌళి పనితనాన్ని, కాల్పనిక శక్తికి.. దాసోహం అన్నారు.

ఇంతమందికి నచ్చిన జక్కన్న పనితనం... మన తెలుగు దర్శకులకి మాత్రం అంతగా నచ్చినట్లుగా కనిపించడం లేదు. తెలుగు దర్శకుల్లో త్రివిక్రమ్, వినాయక్, శ్రీను వైట్ల వంటి వారు టాప్ లిస్ట్‌ లో ఉంటారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాహుబలి సక్సెస్ గురించి కానీ, రాజమౌళి దర్శక ప్రతిభ గురించి కానీ నోరు మెదపలేదు ఇప్పటివరకూ. ఆఖరికి సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే పూరి, వైట్లలు.. చిన్న ట్వీట్ చేయలేదు.

రికార్డులు సృష్టించాలన్నా మేమే... తిరగరాయాలన్నా మేమే అని డైలాగులు చెప్పించిన డైరెక్టర్లకు ఇప్పుడు నోరు మెదలడం లేదు. ఎందుకనో! తోటి దర్శకుడి ప్రతిభను ప్రపంచం పొగుడుతున్నా... వీళ్లకు మాత్రం నోరు రావడం లేదు పాపం. చూస్తుంటే... చెయ్యిత్తి జై కొట్టు తెలుగోడా అని మళ్లీ పాడి వినిపిస్తేనే కానీ వీళ్లలో చలనం రాదు కాబోలు. లేదా లాస్ట్ పంచ్ మనదే కావాలని వెయిట్ చేస్తున్నారో !