గెడ్డమే సక్సెస్ ఫార్ములా

Wed May 23 2018 12:30:40 GMT+0530 (IST)

బాలీవుడ్ లో హీరోలు నున్నటి మొహంతో గెడ్డం మీసం లేకుండా కనిపించడం సర్వ సాధారణం. అక్కడ మీసంతో స్టార్ డం తెచ్చుకున్న ఆఖరి హీరో ఒక్క అనిల్ కపూర్ మాత్రమే. అమితాబ్ మొదలుకుని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రన్వీర్ సింగ్ దాకా ఎవరి మూతులకు మీసాలు ఉండవు. కానీ టాలీవుడ్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. సౌత్ హీరోలకు మీసాలే అందం. మహేష్ బాబు మినహాయిస్తే అవి లేకుండా స్టార్ అయినవాళ్లు చాలా తక్కువ. కానీ కొత్తగా ఇప్పుడు గడ్డం ట్రెండ్ కూడా మొదలైంది. రంగస్థలంలో గుబురు గడ్డంతో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం స్ఫూర్తిగా నిలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతోనే ఈ ట్రెండ్ కు ఊతమిచ్చినప్పటికీ ఇప్పుడు దానికి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి వంశీ పైడిపల్లి సినిమా కోసం గెడ్డం పెంచబోతున్నట్టు వినికిడి. రఫ్ గా మాస్ పాత్రలో సహజమైన లుక్ కోసం మహేష్ ఇప్పటికే ఆ పనిలో ఉన్నాడట. 24 సినిమాల్లో చేయని ప్రయోగం ఇందులో చేస్తున్నాడు అనగానే ఫాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది.మెగాస్టార్ చిరంజీవి సైరా కోసం ఆరు నెలల నుంచి గెడ్డంతోనే ఉన్నారు. మధ్యలో ఓసారి తీయాల్సి వచ్చినా తక్కువ గ్యాప్ లోనే ఒరిజినల్ గెటప్ లోకి వచ్చేసారు. వెంకటేష్  అనిల్ రావిపూడి తో చేయనున్న మల్టీ స్టారర్ లో గెడ్డంతోనే కనిపించనున్నాడు. శర్వానంద్ గతంలో కాస్త మాసిన గెడ్డంతో కొన్ని సినిమాల్లో కనిపించినా కొత్త మూవీలో మాత్రం గుబురు గెడ్డంతో చాలా కొత్తగా కనిపిస్తాడని టాక్. ఒక్క హిట్టు కోసం గట్టిగా ట్రై చేస్తున్న సందీప్ కిషన్ కూడా గెడ్డం తోనే నటించబోతున్నాడు.వీళ్ళు కాకుండా రెగ్యులర్ గానే గెడ్డంతో ఉండే నారా రోహిత్  - రవితేజ లాంటి హీరోలు దానితోనే కొత్తగా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి మాస్ హీరోయిజం గెడ్డంలోనే ఉంటుంది అన్న నిజం మన యూత్ హీరోలు బాగానే పసిగట్టారు. అందుకే పెట్టుడు లాంటి వాటి జోలికి వెళ్లకుండా సహజత్వం కోసం నిజంగానే గడ్డం పెంచడం చూస్తే ఇదో ట్రెండ్ లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.