హీరోలు.. రాజకీయం.. ఓ ఫ్లాప్ స్టోరీ

Fri Feb 22 2019 09:51:35 GMT+0530 (IST)

సినిమాల్లో వాళ్లు స్టార్లు.. అశేష అభిమాన గణం వారి సొంతం.. కానీ రాజకీయాల్లో కాదు.. ఒక్క ఎన్టీఆర్ తప్పితే తెలుగునాట రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన సినిమా స్టార్లు లేరంటే అతిశయోక్తి కాదు.. నిజానికి ఎన్టీఆర్ కూడా స్వచ్ఛ రాజకీయాలంటూ ఈ కుట్రలు - కుతంత్రాల రాజకీయ చట్రంలో బలైపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అంటారు. ఆ విషయం ప్రస్తుత సమీకరణాలను చూస్తే అవగతమవుతోంది.దివంగత ఎన్టీఆర్ నాటి కుల్లు రాజకీయాలను చూసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టారు. కానీ ఈ వర్థమాన రాజకీయ చిత్రంలో ఆయన ఇమడలేకపోయారు. ఒక సారి నాదేండ్ల భాస్కర్ రావు చేతిలో.. మరోసారి చంద్రబాబు చేతిలో అధికారం కోల్పోయి గుండెపోటుతో మరణించారు. సినిమా స్టార్లకు నిజమైన రాజకీయాలు వంటబట్టవనడానికి ఎన్టీఆరే  టాలీవుడ్ కు మొదటి ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోలు నటీనటులు రాజకీయాల్లోకి వస్తున్నారు.. పోతున్నారు.. ఎంపీ ఎమ్మెల్యేలుగా చేసి ఆ తర్వాత కనుమరుగైన వారు ఎందరో ఉన్నారు.. సూపర్ స్టార్ కృష్ణ - కృష్ణంరాజు - దాసరి నారాయణ రావు - మోహన్ బాబు - చిరంజీవి - బాలక్రిష్ణ  వరకూ రాజకీయాల్లో ఒక పార్ట్ గా మిగిలిపోయారే కానీ.. వారే అధికారం చెలాయించే రోజు రాలేదు.. వారు ఈ రాజకీయాల్లో ఇమడలేదు.

తాజాగా ఏపీ పొలిటికల్ తెరపై పవన్ కళ్యాణ్ దూసుకొచ్చారు. పోయిన 2014లో బలం లేదని.. క్యాడర్ లేదని టీడీపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు 2019.. అప్పుడు జనసేన ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మరి ఇప్పుడు సొంతంగా పోటీచేస్తారా.? మళ్లీ మద్దతు మంత్రం జపిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో విజిల్ బ్లోయర్ పాత్రకే పవన్ పరిమితమవుతూ అధికారాన్ని సొంతంగా చేపట్టడంలో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట..

ఇక 2019 కేంద్రంగా టాలీవుడ్ కు కమెడియన్ - ఆర్టిస్టులు ఫృథ్వీ - పోసాని కృష్ణ మురళి సహా చాలా మంది ఆర్టిస్టులు వివిధ పార్టీలకు మద్దతిస్తూ హల్ చల్ చేస్తున్నారు. వారి భవిష్యత్ ఏంటనేది ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత తేలుతుంది.

 కేవలం ఎంపీ - ఎమ్మెల్యేగా మాత్రమే సినీ కళాకారులు పరిమితమైపోతున్నారు. రాజకీయాలను శాసించే స్థాయిలో మన కళాకారులు ఎదగలేకపోతున్నారు.  ‘‘అందుకే టాలీవుడ్ లో హీరోల రాజకీయం ఓ ఫ్లాప్ స్టోరీగా మిగిలిపోయింది. ’’