టాలీవుడ్ సమ్మర్ బిజినెస్ 700 కోట్లు

Mon Mar 13 2017 15:24:50 GMT+0530 (IST)

ఏటేటా సమ్మర్ కి సినిమా వ్యాపారం పీక్ స్టేజ్ లో ఉంటుంది. భారీ చిత్రాల రిలీజ్ లతో బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఈ సారి వేసవికి మాత్రం భారీ ఎత్తున.. ఏకంగా 700 కోట్ల బిజినెస్ జరగబోతోంది.

ఈ వేసవిని పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కాటమరాయుడుతో ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం కనీసం 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే వ్యాపారం జరిగింది  కూడా. ఆ తర్వాత శర్వానంద్ నటించిన రాధా..  ఈనెల 29నే థియేటర్లలోకి రానుంది. ఉగాది కానుకగా వస్తున్న ఈ  మూవీపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

వచ్చే నెల 7వ తేదీన వెంకటేష్ నటించిన గురు విడుదల కానుండగా.. అదే రోజున మణిరత్నం మూవీ చెలియా కూడా విడుదల అవుతోంది. దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో.. చెలియా కూడా భారీగా రిలీజ్ అవడం ఖాయమే. అదే డేట్ కి అల్లు శిరీష్ నటించిన మలయాళ చిత్రం 1971 బెయాండ్ బోర్డర్స్ కు డబ్బింగ్ వెర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది.

వరుణ్ తేజ్ నటించగా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28న బాహుబలి ది కంక్లూజన్ విడుదలవుతోంది. ఈ మూవీ ఒక్కటే 400 కోట్ల వ్యాపారం చేయనుందనే అంచనాలున్నాయి. బాహుబలి2 తర్వాత మే 12న నిఖిల్ నటించిన కేశవ మే నెల 12వ తేదీన విడుదల కానుండగా.. మే 19వ తేదీన అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధం రిలీజ్ కానుంది. ఈ చిత్రం 80 కోట్లమేర వ్యాపారం చేయనుందని అంచనా.

మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశాలుండగా.. మొత్తం మీద ఈ సమ్మర్ లో 700 కోట్ల వ్యాపారం చేసేస్తోంది టాలీవుడ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/