Begin typing your search above and press return to search.

ఈ ఓవర్సీస్ కు ఏమైంది

By:  Tupaki Desk   |   15 July 2018 6:01 AM GMT
ఈ ఓవర్సీస్ కు ఏమైంది
X
ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే హిందీ సినిమాలకు కల్పతరువులా ఉండేది కానీ గత మూడు నాలుగేళ్లుగా సౌత్ సినిమాలు కూడా వాటి కన్నా మిన్నగా సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నాయి. గత ఏడాది బాహుబలి 2 ఈ ఏడాది రంగస్థలం-భరత్ అనే నేను-మహానటి లాంటి సినిమాలు తెచ్చిన వసూళ్లే దానికి నిదర్శనం. ఇక్కడ కొంచెం తేడా కొట్టినా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటే చాలు కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత నెల రోజులకు పైగా సత్తా చాటే సరైన తెలుగు సినిమా లేక అక్కడి ట్రేడ్ అయ్యో అయ్యయ్యో అంటూ కూనిరాగాలు తీస్తోంది. కారణం ఎన్ని సినిమాలు వచ్చినా కనీసం అర మిలియన్ డాలర్లు తెచ్చే దిశగా కూడా వెళ్ళకపోవడం. ఇదే వాళ్ళ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. హీరో ఎవరు అనే దానితో సంబంధం లేకుండా అన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. ఇక్కడ ఓ మాదిరి టాక్ వచ్చినా అక్కడ మాత్రం నిలవలేకపోతున్నాయి.

మెగా అల్లుడిగా టాలీవుడ్ ప్రవేశం చేసిన కళ్యాణ్ దేవ్ విజేత అంచనాలు అందుకోలేక పూర్తిగా చతికిలపడింది. ఎమోషనల్ అప్పీల్ బాగానే ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం ఓపెనింగ్స్ తో పాటు రన్ ని కూడా దెబ్బ తీస్తోంది. అమెరికాలో మొదటి రోజు కేవలం 21 వేల డాలర్లు మాత్రమే వసూలు చేయటం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఇక కార్తి చినబాబు దీనికి భిన్నంగా ఏమి లేదు. మితిమీరిన సెంటిమెంట్ తో పాటు ఆరవ వాసన ఎక్కువ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఏమంత ఆసక్తి చూపడం లేదు. తెలుగు తమిళ వెర్షన్లు రెండూ కలిపి 32 నుంచి 60 వేల డాలర్ల మధ్యే ఉండటం ఫలితాన్ని సూచిస్తోంది. ఇక్కడ ఇరగాడేస్తున్న ఆరెక్స్ 100 కొంచెం మెరుగ్గా 71 లొకేషన్స్ లో 43 వేల డాలర్ల దాకా రాబట్టింది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ కాకపోవడంతో దాని ప్రభావం కలెక్షన్ మీద చూపిస్తోంది. ఇవేవి బెంచ్ మార్క్ కలెక్షన్స్ కావు. మహానటి తర్వాత ఇంత డ్రై సీజన్ ని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భరించలేకపోతున్నారు. దగ్గరలో స్టార్ హీరో సినిమా ఏది లేనందున వస్తున్న చిన్న మధ్య తరహా సినిమాల్లో ఏదైనా హిట్ కాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి వచ్చే వారం అయినా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.