Begin typing your search above and press return to search.

టాలీవుడ్ దమ్మేంటో తెలుస్తోందిగా

By:  Tupaki Desk   |   15 Oct 2018 6:26 AM GMT
టాలీవుడ్ దమ్మేంటో తెలుస్తోందిగా
X
ఒకప్పుడు ఓవర్ సీస్ మార్కెట్ అంటే కేవలం హింది సినిమాలకు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేది. తెలుగు స్టార్ హీరోలవి ఓ మోస్తరుగా ఆడటం తప్ప అంతగా ప్రభావం అయితే ఉండేది కాదు. కాని ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు బాలీవుడ్ సినిమాల కలెక్షన్ల గురించి బాకాలు ఊదే ట్రేడ్ అనలిస్టులు ఇప్పుడు తెలుగు గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. కారణం ఆకాశమే హద్దుగా అంతకంతకు పెరుగుతున్న మన మార్కెట్.

తాజాగా అరవింద సమేత వీర రాఘవ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ ను దాటడమే కాక ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన రంగస్థలం-భరత్ అనే నేను సరసన నిలించేందుకు పరుగులు పెట్టడం దీనికి మరింత ఊతమిస్తోంది. సాధారణంగా ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు యుఎస్ లో కాస్త ఆదరణ తక్కువగా ఉంటుంది. అందుకే జనతా గ్యారేజ్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ కన్నా నాన్నకు ప్రేమతో లాంటి స్టైలిష్ రివెంజ్ థ్రిల్లర్ వాళ్లకు బాగా నచ్చింది

ఇప్పుడు ఈ సమీకరణల్ని అరవింద సమేత వీర రాఘవ పూర్తిగా మార్చేస్తోంది. ఈజీగా ఒక మిలియన్ మార్కును అందుకోవడమే కాక జోరుని అలాగే కొనసాగిస్తూ ఉండటం తారక్ ఫాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇది ఏ రేంజ్ సక్సెస్ అనే అంచనాకు ఇప్పటికిప్పుడు రాలేం కానీ దుబాయ్-ఆస్ట్రేలియా లాంటిదే దేశాల్లో సైతం మంచి ఆదరణ దక్కడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. దీన్ని బట్టి బాహుబలి లాంటి ఫాంటసీ సినిమాలే కాకుండా మెప్పించేలా ఉండే కమర్షియల్ సినిమాలకు సైతం భారీ వసూళ్లు దక్కుతాయని ప్రూవ్ అయ్యింది.

ఈ ఏడాది పైన చెప్పినవి కాకుండా మహానటి-గీత గోవిందం-గూఢచారి లాంటి మీడియం బడ్జెట్ సినిమాలు సైతం తమ ఉనికిని చాటుకోవడంతో రానున్న రోజుల్లో ఓవర్సీస్ లో సినిమా ఆధిపత్యమే ఉండబోతోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రముఖ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ సైతం ఈ నిజాన్ని ఒప్పుకోవడం గమనార్హం.