Begin typing your search above and press return to search.

తెరపైకి కొత్త నిర్మాత మండలి

By:  Tupaki Desk   |   24 Nov 2017 6:04 AM GMT
తెరపైకి కొత్త నిర్మాత మండలి
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు రేపిన కలకలం ఇంకా ఇండస్ట్రీలో సద్దుమణగలేదు. ఎవరికి వారు బయటకు మాట్లాడటం తగ్గించినా లోపలున్న ఆవేనదలు ఇంకా ఏం చల్లారలేదు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇంకో సంకటం ఇండస్ట్రీకి అంతర్గతంగా ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఇప్పుడు సినిమా నిర్మాతలకు మార్గదర్శకంగా ఉన్న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టి.ఎఫ్.పి.సి.) రద్దయిందని తెలుస్తోంది.

నిర్మాతల మండలి గత కొద్ది నెలలుగా చాలా విమర్శలే మూటగట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ డబ్బుల ఖర్చు విషయంలో సక్రమంగా వ్యవహరించడం లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు అసంతృప్తి స్వరం వినిపిస్తూ వస్తున్నారు. ఈమధ్య జరిగిన కౌన్సిల్ మీటింగులో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు కౌన్సిల్ ను ఇరుకున పెట్టాయి. దీనికితోడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు చాలా కాలంగా ఎన్నికలు కూడా జరగని విషయాన్ని కొందరు లేవనెత్తారని తెలుస్తోంది. లీగల్ గా ఎదురయ్యే ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని ఏకంగా కౌన్సిల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతానికి నిర్మాతల మండలిని నడిపించేందుకు ఓ టెంపరరీ కమిటీని కూడా ఎన్నుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు.. దుర్గా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చదలవాడ శ్రీనివాసరావుతోపాటు మరో ఐదుగురు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలు జరిగి కొత్త కమిటీ ఏర్పడేవరకు ఈ తొమ్మిదిమందే నిర్మాతల మండలిని నడిపించనున్నారు.