Begin typing your search above and press return to search.

ఫిలిం ఇండస్ట్రీ.. ఇక టీడీపీతో కష్టమే

By:  Tupaki Desk   |   11 Dec 2018 5:30 PM GMT
ఫిలిం ఇండస్ట్రీ.. ఇక టీడీపీతో కష్టమే
X
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ మద్దతు దారులని అనుకుంటారు. సినీ రంగం నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ కావడంతో చాలా కాలం సినీ రంగం నుంచి ఎక్కువ మద్దతు తెలుగుదేశమే పొందింది. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీకి సినీ రంగం నుంచి బాగానే మద్దతు లభించింది. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి క్రమంలో సినీ జనాలు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రా రాజకీయాల్లో జనసేన కీలకంగా వ్యవహరిస్తుండటం.. వైఎస్సార్ కాంగ్రెస్ ఊపు కనిపిస్తుండటంతో సినిమా వాళ్లు తెలుగుదేశం పార్టీ నుంచి క్రమంగా దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు సినీ పరిశ్రమకు కేంద్రం అయిన హైదరాబాద్ లో టీడీపీకి పట్టే లేదు.

ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం ఏమైనా ఉంటే.. సినీ జనాలు ఆ పార్టీ వైపు చూసేవాళ్లేమో. కానీ తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మట్టి కొట్టుకుపోయింది. టీఆర్ ఎస్ సెటిటర్లు.. ఆంధ్రా వాళ్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు హైదరాబాద్ సహా అన్ని చోట్లా టీఆర్ ఎస్ ఆధిపత్యమే కనిపించింది. హైదరాబాద్ వాళ్ల చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడిక తెలుగుదేశం వైపు సినీ జనాలు చూసే పరిస్థితే కనిపించట్లేదు. మొన్న టీడీపీ ఎన్నికల ప్రచారానికి కూడా సినీ జనాలెవ్వరూ రాలేదు. ఎన్నికల ఫలితాలపై చాలామంది సినీ ప్రముఖులు స్పందిస్తూ.. కేసీఆర్ కు అభినందనలు చెప్పడాన్ని బట్టి మున్ముందు ఇండస్ట్రీ నుంచి టీడీపీకి మద్దతు చాలా కష్టమనే అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ.. వారికి సన్నిహితులైన వాళ్లంతా పవన్ వైపు నిలిచినా.. మిగతా వాళ్లలో చాలామంది వైకాపా వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ కు వైకాపా పరోక్ష మద్దతు కూడా ఉండటంతో ఆ పార్టీకి సినీ జనాల నుంచి మద్దతు లభించే ఆస్కారముంది.