డౌన్ డౌన్ చంద్రబాబు.. జిందాబాద్ ఎన్టీఆర్

Thu May 23 2019 23:00:01 GMT+0530 (IST)

చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో. ఈ దెబ్బతో పార్టీ భవితవ్యమే ప్రమాదంలో పడిపోయింది. చంద్రబాబు అధికారంలో లేనపుడు ఎంత బలహీనంగా కనిపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2004లో అధికారం కోల్పోయి పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా జావగారిపోయారు. తెలంగాణలో పార్టీని తగలబెట్టేశారు. మామూలుగా అయితే 2014లోనూ ఆయన అధికారంలోకి వచ్చేవారు కాదేమో. కానీ రాష్ట్రం విడిపోవడం కలిసొచ్చి అధికారం అందుకున్నారు. అది కూడా స్వల్ప ఓట్ల తేడాతో. జగన్ ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు. 2014కు ముందు చాలామంది నాయకుల్ని ఆకర్షించారు. ఇప్పుడు ఇంతటి ఘనవిజయంతో అధికారంలోకి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? 70 ఏళ్లకు చేరువ అవుతున్న చంద్రబాబు ఈ స్థితిలో నాయకులకు భరోసా ఇచ్చి పార్టీని నిలబెట్టుకోవడం అంటే అసాధ్యమైన విషయమే.ఇక చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైరవడం మేలంటున్నారు చాలామంది. మరి బాబు నిష్క్రమిస్తే తెలుగుదేశం పార్టీ నడిపించేది ఎవరు అనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆరే సరైన సమాధానం అంటున్నారంతా. లోకేష్ నో - బాలయ్యనో నమ్ముకుంటే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని - వాళ్ల సమర్థత ఏంటో తెలిసిందే కాబట్టి అత్యవసరంగా జూనియర్ ఎన్టీఆర్ ను తెరమీదకి తేవాలన్న డిమాండ్లు ఆల్రెడీ మొదలైపోయాయి. తెలుగుదేశం అభిమానులే ఈ మాట అంటుండటం విశేషం. ఎన్నికలతో తారక్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అతడి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అతడే అని.. అతడికి సాధ్యమైనంత త్వరగా బాధ్యతలు అప్పగించకపోతే పార్టీ మనుగడే కష్టం అంటున్నారు. లేదంటే పార్టీ నాశనం అయిపోతుందని.. చంద్రబాబు తనకు తానుగా ఎన్టీఆర్ ను చేరదీసి పగ్గాలు అందించకపోతే.. అతనే పార్టీని భవిష్యత్తులో లాక్కొనే పరిస్థితి రావచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు.