Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ వ‌ద్దంటున్న తెలుగు సినిమా

By:  Tupaki Desk   |   5 Sep 2015 12:38 PM GMT
హైద‌రాబాద్ వ‌ద్దంటున్న తెలుగు సినిమా
X
తెలుగు సినిమా త‌న రూటు మార్చుకుంది. కొత్త అందాల‌ను వెతుక్కుంటోంది. రామోజీ ఫిలింసిటీలోకి ఎంట‌ర్ అయితే చాలు అక్క‌డ ఏ స్థాయి సినిమా అయినా తీసేసుకోవ‌చ్చు. దేశ్య‌వ్యాప్తంగా ప‌లు రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించిన టాలీవుడ్ సినిమా బాహుబ‌లి కూడా ఆర్ ఎఫ్‌ సీ లోనే షూటింగ్ జ‌రుపుకుంది. అక్క‌డ ఆ సినిమా కోసం ఏకంగా 110 ఎక‌రాల్లో ర‌క‌రకాల సెట్లు వేశారంటే..ఓ సినిమా తీయ‌డానికి హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లాల్సిన అస‌వ‌రం ఏముంద‌ని మ‌నం ప్ర‌శ్నించుకోవాల్సిందే. సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ల్యాబ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు డ‌బ్బులు ఉండాలే కాని హైద‌రాబాద్ దాట‌కుండా సినిమా తీసేయొచ్చు.

అయితే రోజురోజుకు తెలుగు సినిమా ప‌ల్లె వాతావ‌ర‌ణానికి దూర‌మ‌వుతోంద‌ని..సినిమాల్లో గ్రామీణ నేప‌థ్యం క‌నుమరుగవుతోంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు కూడా టాలీవుడ్‌లో పెద్ద సినిమా నుంచి చిన్న సినిమాల వ‌ర‌కు అదే చ‌ట్రంలో కొట్టుకుపోయాయి. అయితే పెరుగుట విరుగుట కొర‌కే అన్న‌ట్టు టాలీవుడ్ రూటు మారింది. నిన్నటి వరకూ న‌గ‌రాల్లో, విదేశీ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టిన తెలుగు సినిమా కథలు.. ఇప్పుడు పల్లెటూరి దారులు వెతుక్కుంటున్నాయి.

ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన శ్రీమంతుడు సినిమానే తీసుకుంటే బ్యాక్‌ డ్రాప్ మొత్తం ప‌ల్లెటూరి నేప‌థ్యంలోనే సాగింది. సినిమాలో సీన్ల‌లో ప‌ల్లెటూరి క‌ళ చ‌క్క‌గా ఉట్టిప‌డింది. ఈ సినిమాలోని ఊరు ద‌త్త‌త అనే కాన్సెఫ్ట్ కూడా ప‌ల్లెటూరి అందాలు బాగా చూపించ‌డానికి క‌లిసివ‌చ్చింది. నాగార్జున కొత్త సినిమా సోగ్గాడే చిన్నినాయన కూడా ఈ కోవ‌లోనిదే! ఈ చిత్రాన్ని ఎక్కువభాగం పల్లెటూరిలోనే చిత్రీకరించడం విశేషం. నాగ్ పంచెక‌ట్టు...ఆ బుల్లెట్ చూస్తుంటేనే ఈ మూవీలో గ్రామీణ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతోంది.

పెద్ద సినిమాల సంగ‌తి ఎలా ఉంటే చిన్న సినిమాలు కూడా ప‌ల్లెటూరి దారులు వెతుక్కుంటున్నాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న 'కుందనపు బొమ్మ' సినిమా ఈ కోవకు చెందినదే. ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణ తనయుడు వర డైరెక్ట్ చేసిన ఈ సినిమా పచ్చదనంతో నిండిపోయింది. ఇక ద‌ర్శ‌కుడు తేజ సినిమాల్లో ఎక్కువ‌గా గ్రామీణ వాతావ‌ర‌ణ నేప‌థ్యంతో కూడుకున్న‌వే. ఆయ‌న‌కు ఇండ‌స్ర్టీ హిట్లు ఇచ్చిన జ‌యం, ల‌క్ష్మీ క‌ళ్యాణం, నువ్వు నేను సినిమాలు ప‌ల్లెటూరి నేప‌థ్యంలోనే ఉంటాయి. త‌ర్వాత ఆయ‌న సిటీ బేస్‌డ్ ఆధారంగా తీసిన సినిమాలు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ రూటు మార్చి మరోసారి పల్లెటూరినే ఎంచుకున్నాడు. దిలీప్, దక్షను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. 'హోరా హోరీ 'అనే సినిమాను పూర్తిగా పల్లెటూరిలో తెరకెక్కించాడు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే అన్ని ప్రేముల్లోను ప‌ల్లెటూరి అందాలు ప‌చ్చ‌గా ప‌రిచేసిన‌ట్టుగా అనిపిస్తున్నాయి.

తెలుగు సినిమా మ‌ళ్లీ విదేశీ వీధుల నుంచి సిటీల‌ను కూడా వ‌దిలేసి ప‌ల్లెటూర్ల వైపు ప‌రుగులు తీయ‌డం అభినంద‌న‌నీయం. ఇది మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప‌దికాలాల పాటు కాపాడుకోవ‌డానికి స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది.