చరణ్ వచ్చేవరకు వెలవెలేనా?

Sun Feb 18 2018 19:00:01 GMT+0530 (IST)

సినిమాల సక్సెస్ రేట్ విషయంలో పెద్దగా మార్పులేమీ లేవు. పది సినిమాల్లో ఒకటో రెండో మాత్రమే ఆడుతున్నాయి. అయినప్పటికీ సినిమాల ప్రొడక్షన్ ఏమీ తగ్గట్లేదు. ప్రతి ఏడాది సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రిలీజయ్యే సినిమాలు 120-150 మధ్య ఉంటుండటం విశేషం. ఇక అంతా రెడీ అయి కూడా విడుదలకు నోచుకోకుండా ఆగిపోతున్న సినిమాలు ఇంకెన్నో. సినిమాల ప్రొడక్షన్ పెరిగిపోతుండటంతో ఏ వారం కూడా ఏ సినిమా కూడా సోలోగా రిలీజవ్వట్లేదు. పెద్ద సినిమాలకు కొంచెం సైడివ్వగానే చిన్న సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. ఒకే వీకెండ్లో రెండు లేదా మూడు.. కొన్నిసార్లు అరడజనుకు పైగా సినిమాలు రిలీజైన సందర్భాలు కూడా ఉన్నాయి.ఏడాది ఆరంభంలో సంక్రాంతికి భారీ సినిమాల సందడి ఉంటుంది. ఆ తర్వాత రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి రెండు మూడు వారాల పాటు సందడి ఉంటుంది. కానీ ఫిబ్రవరి మూడో వారం నుంచి సినిమాల సందడి బాగా తగ్గిపోతుంది. ఈ టైంలో కొంచెం పేరున్న సినిమాలు రిలీజవ్వవు. సినిమాలకు మహరాజ పోషకులైన యువత పరీక్షల హడావుడిలో ఉంటుంది ఈ టైంలో. అందుకే కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉండవు. దీంతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమాలే ఈ టైంలో రిలీజవుతుంటాయి. మళ్లీ మార్చి చివరి వారం నుంచి సందడి మొదలవుతుంది. అప్పటికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్షలు ముగించుకుని సినిమాల కోసం ఆవురావురుమని ఉంటారు. ఆ తర్వాత మిగతా క్లాసుల విద్యార్థులు దశలు దశలుగా ఫ్రీ అవుతారు. మధ్యలో మాత్రం నెలా నెలన్నర పాటు థియేటర్లు వెలవెలబోతుంటాయి. ప్రస్తుతం ‘కిరాక్ పార్టీ’.. ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘కణం’ లాంటి సినిమాలు అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ అన్ సీజన్లో రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఏమో అన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రొడ్యూసర్లు. ఇవి తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ కనిపించడం లేదు. ఈ మూడు సినిమాలూ ఈ సీజన్లోనే వస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేం. వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లయితే ఉండవు. మార్చి నెలాఖర్లో రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ వచ్చే వరకు బాక్సాఫీస్ వెలవెలబోవడం ఖాయమనే చెప్పాలి.