Begin typing your search above and press return to search.

కొత్త మలుపు తిరుగుతున్న తెలుగు సినిమా

By:  Tupaki Desk   |   24 April 2019 5:30 PM GMT
కొత్త మలుపు తిరుగుతున్న తెలుగు సినిమా
X
గత రెండు మూడేళ్ళుగా కమర్షియల్ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. అరిగిపోయిన ఫార్ములాలకు స్వస్తి చెప్పి నవతరం దర్శకులు కొత్తబాట పడుతున్నారు. ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటితరం కోల్పోతున్న ఫీలింగ్స్ ని తెరపై చూపిస్తూ పేరు ప్రశంసలతో పాటు కాసులు కురిపిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణగా జెర్సీనే చెప్పుకోవచ్చు. క్రికెట్ నేపధ్యంలో తండ్రి కొడుకుల అనుబంధాన్ని హై లైట్ చేస్తూ దర్శకుడు గౌతం తిన్ననూరి చూపించిన పనితనం స్టార్లను సైతం మెప్పిస్తోంది.

అందుకే మూస నుంచి బయటపడి కొత్తదనం అందించే దర్శకుడు స్టార్ ఎవరైనా ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన మహానటి-గీత గోవిందం-ఆరెక్స్ 100 - గూడచారిలలో మచ్చుకు కూడా రొటీన్ అంశాలు కనిపించవు. పాయింట్ లో వైవిధ్యం మొదలుకుని ప్రెజెంటేషన్ దాకా వినూత్న రీతిలో తీసిన తీరు వీటిని సూపర్ హిట్ చేశాయి

ఒకప్పుడు 2000 సంవత్సరం దాకా తెలుగు సినిమా మూసలోనే ఉంది. ప్రేమ-ఫ్యాక్షన్-మాస్ మసాలా హీరోయిజం-ట్రయాంగిల్ లవ్-పెళ్లి-విప్లవం అంటూ కొన్ని పరిమితుల మధ్యే దర్శకులు రచయితలు కథలు అల్లుకుంటూ వచ్చారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. అభిరుచులు అలవాట్లు చాలా మారిపోయాయి. టెక్నాలజీ డామినేషన్ ఎక్కువైపోయింది. ప్రపంచ సినిమా అరచేతుల్లోకి వచ్చి వాలింది. చిన్న సీన్ కాపీ కొట్టినా అడ్డంగా దొరికిపోయే పరిస్థితి.

అందుకే ఈ ధోరణికి తగ్గట్టే సున్నితమైన అంశాలు చొప్పించేందుకు దర్శకులు ఇష్టపడుతున్నారు. మెప్పించేలా కంటెంట్ ని చూపిస్తే చాలు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరూ మూకుమ్మడిగా ఓటేసి సినిమాలను గెలిపిస్తున్నారు. అయితే ఈ సృజనాత్మకతను ఎక్కువ కాలం నిలుపుకున్న దర్శకులకే ఫ్యూచర్ ఉంటుందన్న మాట కూడా వాస్తవం