Begin typing your search above and press return to search.

కొత్త సినిమాలా.. వద్దు బాబోయ్

By:  Tupaki Desk   |   3 Oct 2015 10:30 PM GMT
కొత్త సినిమాలా.. వద్దు బాబోయ్
X
ఈ ఏడాది ప్రథమార్ధంలో టాలీవుడ్ కి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రావాల్సిన పెద్ద సినిమాలు రాలేదు. వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఐతే ద్వితీయార్ధం మాత్రం సందడి బాగానే ఉంది. ఇప్పటికే దాదాపు ఐదు హిట్లు టాలీవుడ్ ఖాతాలో జమయ్యాయి. అందులో బాహుబలి, శ్రీమంతుడు బ్లాక్ బస్టర్లు కాగా.. ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ హిట్ రేంజిని అందుకుంది. సినిమా చూపిస్త మావ - సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అయ్యాయి.

ఐతే ఈ ఐదు సినిమాల ప్రత్యేకత ఏంటంటే.. ఏదో తొలి వారం సందడి చేసి ఆ తర్వాత జోరు తగ్గించేయకుండా తర్వాతి వారాల్లో కూడా జోరు చూపిస్తుండటం. కొత్త సినిమాలు వస్తున్నా వాటిని కాదని.. ఈ పాత సినిమాలకే ప్రేక్షకులు పట్టం కట్టారు. బాహుబలి సినిమా ‘శ్రీమంతుడు’ వచ్చే వరకు బ్రహ్మాండంగా ఆడింది. శ్రీమంతుడు కూడా నెల రోజుల పాటు హవా సాగించింది. ‘శ్రీమంతుడు’ వచ్చిన వారానికి వచ్చిన చిన్న సినిమా ‘సినిమా చూపిస్త మావ’ కూడా పోటీని తట్టుకుని మూడు వారాల పాటు జోరు చూపించింది. ఇక భలే భలే మగాడివోయ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. దీని తర్వాత హిట్టయిన మూవీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా రెండో వారంలో హవా సాగిస్తోంది.

ఈ వారం విడుదలైన శివమ్ - పులి సినిమాలకు పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆ సినిమాలపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో వీకెండ్ లో రెండు రోజులు భలే భలే మగాడివోయ్ - సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలే ప్రేక్షకుల ఛాయిస్ అవుతున్నాయి. బుకింగ్స్ చూస్తే ఈ సంగతి బాగా అర్థమవుతుంది. రెండు సినిమాలకూ శని - ఆదివారాల్లో బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోతుండటం విశేషం.