Begin typing your search above and press return to search.

కేన్స్ 2019: తెలంగాణ సినిమాకి పెట్టుబ‌డులు?!

By:  Tupaki Desk   |   20 May 2019 4:31 AM GMT
కేన్స్ 2019: తెలంగాణ సినిమాకి పెట్టుబ‌డులు?!
X
ఏపీ- తెలంగాణ డివైడ్ త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ విభ‌జ‌న గురించిన‌ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆ క్ర‌మంలోనే తెలంగాణ‌లో తెలంగాణ సినిమాని డెవ‌ల‌ప్ చేస్తామ‌ని స్థానిక పెద్ద‌లు ఉవ్విళ్లూరారు. సినీప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం పెరుగుతుంద‌ని ఢంకా భ‌జాయించారు. పూణే త‌ర‌హా ఫిలిం ఇనిస్టిట్యూట్ క‌ట్టేస్తామ‌న్నారు. ఎక‌రాల స్థ‌లం కోసం ప‌రిశీలన సాగింది. గ‌చ్చి బౌళి ప‌రిస‌రాల్లో టీ-ఫిలిం యానిమేష‌న్ హ‌బ్ నిర్మిస్తామ‌ని అందుకోసం విదేశీ పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తాయని ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ వీటికి సంబంధించి మాట‌ల వ‌ర‌కే కానీ చేత‌ల్లో మాత్రం శూన్యం అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిగో పులి అంటే అదిగో మేక‌! అన్న చందంగానే ఉంది ప‌రిస్థితి. మ‌రి ఇవ‌న్నీ తెస్తారా? పెట్టుబ‌డులొస్తాయా? ఇక‌నైనా ఆ ప‌ని చేస్తారా? అంటూ తెరాస ప్ర‌భుత్వాన్ని మీడియా ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే వీట‌న్నిటికీ సొల్యూష‌న్ వెతికేందుకు కేన్స్ 2019 వేడుక‌ల్ని ఉప‌యోగించుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఫ్రెంచి రివెరా(ఫ్రాన్స్)లో ప్ర‌స్తుతం నాలుగు రోజులుగా కేన్స్ చ‌ల‌న‌చిత్రోత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌ డీసీ ఛైర్మన్ రామ్మోహ‌న్ పాల్గొంటున్నారు. ఆయ‌న‌ అక్క‌డికి వెళ్ల‌డానికి కార‌ణం ఆస‌క్తిక‌రం. తెలంగాణ సినిమా అభివృద్ధికి.. కొత్త త‌రం సాంకేతిక‌త‌ను దిగుమ‌తి చేసేందుకు.. పెట్టుబ‌డుల్ని స‌మీక‌రించేందుకు ఈ విజిట్ ని ఉప‌యోగిస్తున్నామ‌ని డాంభికంగా ప్ర‌క‌టించారు. ఇందుకోసం విదేశీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించేందుకు వెళ్లామ‌ని అన్నారు. ఆ మేర‌కు మీడియాకి ఓ నోట్ అందింది. ఆ వివ‌రాల్ని ప‌రిశీలిస్తే..

``తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి - తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పి.రామ్మోహనరావు ఫ్రాన్స్‌ లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ - విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు - సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి - యానిమేషన్ - వీడియో గేమింగ్ విభాగాలను విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా హిందుజా గ్రూప్ బ్రదర్స్‌ తో తెలంగాణలో ఎంటర్‌ టైన్‌ మెంట్ విభాగంలో స్టూడియాల నిర్మాణానికి ఇతర విభాగల్లో పెట్టుబడులు పెట్టాలని రామ్‌ మోహన్‌ రావు ఆహ్వానించారు`` అని వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఈ కేన్స్ చిత్రోత్సవాల్లో డీజీక్విస్ట్ ఛైర్మన్ బసిరెడ్డి - ఐటిపీవో ప్రెసిడెంట్ అసిఫ్ ఇక్భాల్ పాల్గొన్నారని తెలిపారు.

ప్ర‌య‌త్నం బావుంది. అయితే ఫ‌లితం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నారా లేదా? అన్న‌దే ముఖ్యం. పెట్టుబ‌డులు తేవ‌డం అన్న‌ది బృహ‌త్త‌ర‌మైన ప్ర‌క్రియ‌. అందుకు చాలానే కృషి చేయాల్సి ఉంటుంది. కాగితాల‌పై సంత‌కాల‌తో ప‌నైపోద‌న్న‌ది గ్ర‌హించాలి. ఇలాంటి విష‌యాల్లో అంతిమంగా రిజ‌ల్ట్ వ‌స్తేనే హ‌ర్షిస్తారు జ‌నం. మ‌రి అంత క‌సిగా ఎఫ్ డీసీ ఛైర్మ‌న్ ట్రై చేస్తున్నారా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే సస్పెన్స్.