Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'ట్యాక్సీవాలా'

By:  Tupaki Desk   |   17 Nov 2018 7:44 AM GMT
మూవీ రివ్యూ: ట్యాక్సీవాలా
X
చిత్రం : 'ట్యాక్సీవాలా'

నటీనటులు: విజయ్ దేవరకొండ - ప్రియాంక జవాల్కర్ - మాళవిక నాయర్ - మధు నందన్ - విష్ణు - రవి వర్మ - సిజ్జు - యమున - రవి ప్రకాష్ - కళ్యాణి - కిరీటి - ఉత్తేజ్ - చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: సుజీత్ సారంగ్
స్క్రీన్ ప్లే - మాటలు: సాయికుమార్ రెడ్డి
నిర్మాత: ఎస్కేఎన్
కథ - దర్శకత్వం: రాహుల్ సంకృత్యన్

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. ‘నోటా’తో విజయ్ దేవరకొండకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సినిమా వచ్చిన నెలన్నర లోపే ‘ట్యాక్సీవాలా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్. వేసవిలోనే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడి ఈ రోజే రిలీజైంది. కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లలో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేసి.. చివరికి వాటన్నిటికంటే మెరుగైందని భావించి క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అతడి దగ్గరున్న తక్కువ డబ్బులకు పాతికేళ్ల ముందు నాటి పాత కారు మాత్రమే వస్తుంది. దాన్నే బాగు చేయించుకుని క్యాబ్ సర్వీస్ మొదలుపెడతాడు శివ. అదొచ్చాక శివకు బాగా కలిసొస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కారులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులో దయ్యం ఉందని తెలుసుకుంటాడు విజయ్. ఇంతకీ ఆ దయ్యం కథేంటి.. దానికి కారుకు సంబంధమేంటి.. ఈ దయ్యం గొడవ నుంచి బయట పడటానికి శివ ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హార్రర్ థ్రిల్లర్.. ఎప్పటికీ ఔట్ డేట్ కాని జానర్. కాకపోతే గత దశాబ్దంలో ‘హార్రర్ థ్రిల్లర్’లో ‘థ్రిల్లర్’ తీసేసి ‘కామెడీ’ చేర్చి బాగా అరగదీసేశారు. ఒకే ఫార్మాట్లో వరుసబెట్టి సినిమాలు తీసి జనాలకు మొహం మొత్తేలా చేశారు. హార్రర్ కామెడీ అంటేనే బెంబేలెత్తిపోయేలా చేశారు. ఇలాంటి తరుణంలో యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. కొత్త రైటర్ సాయికుమార్ రెడ్డి అండతో.. జానర్ నుంచి పక్కకు వెళ్లకుండా.. కథకు కట్టుబడి ‘ట్యాక్సీవాలా’ సినిమా తీశాడు. సూపర్ నేచురల్ ఎలిమెంట్ ను కొంచెం సైంటిఫిక్ వేలో చెప్పే ప్రయత్నమూ చేయడం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే ప్రయత్నమూ చేశాడు. అలాగని ఇదేమీ పూర్తి సీరియస్ సినిమా కాదు. హార్రర్ కామెడీల్లో మాదిరి ‘బాదుడు’ కామెడీ కాకుండా సిచువేషనల్ కామెడీతో మంచి వినోదమూ పంచాడు. మరీ ఊపేసే ఉత్కంఠ.. పేలిపోయే కామెడీ ఏమీ లేవు కానీ.. ఉన్నంతలో బాగానే ఎంగేజ్ చేస్తుంది ‘ట్యాక్సీవాలా’. ఒకసారి రైడ్ కు వెళ్లడానికి ఢోకా లేని చిత్రమిది.

కారులో దయ్యం.. ‘ట్యాక్సీవాలా’ కోర్ పాయింట్ ఇదే అని దీని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఒక మనిషి ఆత్మ కారులోకి ప్రవేశించి.. ఆ కారు ఇష్టానుసారం ప్రవర్తించడం అన్నది కొత్త పాయింటేమీ కాదు. హాలీవుడ్లో ఈ నేపథ్యంలో సినిమాలొచ్చాయి. తెలుగులో కూడా ‘డోర’ అనే డబ్బింగ్ మూవీ కూడా ఇలాంటి కథతోనే తెరకెక్కింది. కారులో దయ్యం అనే పాయింట్ ముందే కథ రివీల్ చేసేసిన నేపథ్యంలో ‘ట్యాక్సీవాలా’లో కొత్తగా ఇంకేం ఉంటుందని అనిపించడం సహజం. ఎవరో ఒక మనిషి ఆత్మ కారులోకి వచ్చి తనను చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం.. ఇలా రొటీన్ గా కథ నడిచిపోతుందనే అనుకుంటాం. ఐతే ‘ట్యాక్సీవాలా’ కథ ఇలాగే నడుస్తుంది కానీ.. ప్రేక్షకుడి అంచనాకు అందని ఒక కొత్త పాయింట్ ఇందులో డిస్కస్ చేశారు. ‘అస్ట్రాల్ ప్రొజెక్షన్’ అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇందులో లాజిక్ ఎంత.. ఏమేరకు కన్విన్సింగ్ గా అనిపించింది అన్నది పక్కన పెడితే.. ఇది కొత్తగా అయితే అనిపిస్తుంది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది.

ఐతే నిజానికి ‘ట్యాక్సీవాలా’కు అతి పెద్ద ఆకర్షణ మాత్రం ఇందులోని వినోదమే. ముఖ్యంగా ప్రథమార్ధంలో సిచువేషనల్ కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. విజయ్ చెప్పినట్లు ‘పెళ్ళిచూపులు’లో ప్రియదర్శి.. ‘అర్జున్ రెడ్డి’లో రాహుల్ రామకృష్ణ తరహాలో మరో కొత్త కమెడియన్ ‘ట్యాక్సీవాలా’లో మెరిశాడు. విష్ణు అనే కొత్త కుర్రాడు చాలా క్యాజువల్ గా భలే వినోదం పంచాడు. అతడితో పాటు మధునందన్ కూడా మెరిశాడు. వీళ్ల కామెడీకి తోడు విజయ్ వన్ లైనర్స్ కూడా భలేగా పేలాయి. భారీ సన్నివేశాలు.. సెటప్ ఏమీ లేకుండానే సింపుల్ గా ప్రథమార్ధంలో వినోదం పండించాడు రాహుల్ సంకృత్యన్. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. మాటే వినదుగా పాట కూడా కొంత వరకు ఎంగేజ్ చేస్తాయి. కారు-దయ్యం కాన్సెప్ట్ కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ మలుపు ఆకట్టుకుంటుంది. మొత్తంగా తొలి అర్ధభాగంలో ‘ట్యాక్సీవాలా’ మనసులు గెలుస్తాడు.

ఐతే హార్రర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ద్వారా అసలు కథ చెప్పాల్సి వచ్చినపుడు వేగం తగ్గడం సహజం. ‘ట్యాక్సీవాలా’లోనూ అదే జరిగింది. అస్ట్రాల్ ప్రొజెక్షన్ అనే లాజిక్ కు అందని పాయింట్ ను కన్విన్సింగ్ గా చెప్పడానికి టైం తీసుకున్నాడు దర్శకుడు. ఇది కొంతమేర ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ నమ్మశక్యంగా అనిపించదు. పైగా కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. అసలు అరగంట పాటు విజయ్ కనిపించకపోవడం.. ద్వితీయార్ధం చాలా వరకు సీరియస్ గా సాగడంతో ‘ట్యాక్సీవాలా’ గ్రాఫ్ తగ్గుతుంది. విలన్ ఇంట్లో.. మార్చురీలో హీరో బ్యాచ్ చేసే హంగామా వరకు వినోదాన్ని పంచుతుంది కానీ.. ద్వితీయార్ధంలో మిగతా భాగమంతా నెమ్మదిగా నడుస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ఓవరాల్ గా చూస్తే థియేటర్ల నుంచి బయటికి వచ్చేటపుడు ‘ట్యాక్సీవాలా’ కొన్ని మంచి అనుభూతుల్నయితే మిగులుస్తుంది. ఒకసారి రైడ్ చేయడానికి ఫన్.. థ్రిల్ కు ఇందులో ఢోకా లేదు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ మరోసారి మెప్పించాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ‘గీత గోవిందం’లో మాదిరే.. ‘సాధారణమైన’ పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కొంత సేపటికే విజయ్ కి ఉన్న ఇమేజ్ అంతా పక్కకు వెళ్లిపోతుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ గానే చూస్తాం అతడిని. స్టైలింగ్ అదీ మరీ మోడర్న్ గా ఉండటం ఇబ్బందే కానీ.. బాడీ లాంగ్వేజ్.. పెర్ఫామెన్స్ పరంగా విజయ్ పర్ఫెక్ట్ గా చేశాడు. సహజమైన నటనతో.. తనదైన శైలి డైలాగ్ డెలివరీతో విజయ్ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ చూడ్డానికి క్యూట్ గా ఉంది. నటన పరంగా ఆమె రుజువు చూసుకునేంత స్కోప్ ఈ క్యారెక్టర్ ఇవ్వలేదు. ద్వితీయార్ధంలో ఆమెకు అస్సలు అవకాశం లేకపోయింది. మాళవిక నాయర్ కు స్క్రీన్ టైం తక్కువే అయినా కీలకమైన పాత్ర కావడంతో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. హీరో స్నేహితులుగా మధునందన్ తో పాటు కొత్త కుర్రాడు విష్ణు అదరగొట్టారు. సినిమాలో కామెడీ క్రెడిట్ ప్రధానంగా వీళ్లిద్దరిదే. చమ్మక్ చంద్ర కూడా ఉన్న కాసేపు నవ్వించాడు. విలన్ పాత్రలో సిజ్జు ఓకే అనిపించాడు. రవి వర్మ.. యమున.. రవిప్రకాష్.. కళ్యాణి.. ఉత్తేజ్ చిన్న చిన్న పాత్రల్లోనే మెప్పించారు.

సాంకేతికవర్గం:

‘ట్యాక్సీవాలా’ లాంటి సినిమాలో సాంకేతిక నిపుణుల పాత్ర కీలకం. టెక్నీషియన్లందరూ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జేక్ బిజోయ్ నేపథ్య సంగీతం.. పాటలు సినిమాలకు బలంగా నిలిచాయి. పాట్లో ‘మాటే వినదుగా..’ ప్రత్యేకంగా నిలుస్తుంది. మిగతావన్నీ చాలా వరకు బిట్ సాంగ్సే. సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద అస్సెట్. ఈ జానర్ సినిమాకు పర్ఫెక్ట్ గా సూటయ్యే లైటింగ్ థీమ్స్ తో అతను ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్.. ఆర్ట్ వర్క్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. రచయిత సాయికుమార్ రెడ్డి తమ పనితనం చూపించారు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపిస్తుంది. మాటలన్నీ సందర్భానుసారం వచ్చేవే. రాహుల్ హార్రర్ థ్రిల్లర్లను బాగా డీల్ చేయగలనని చాటుకున్నాడు. అతను ఈ తరం దర్శకుడని సినిమాలో చాలా చోట్ల తెలుస్తుంది. అతనెంచుకున్న పాయింట్ కొత్తదే కానీ.. సినిమాలో అంత కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. ఐతే సిచువేషనల్ కామెడీ పండించడంలో.. కథకు కీలకమైన సన్నివేశాల్ని డీల్ చేయడంలో అతడి పనితనం కనిపిస్తుంది.

చివరగా: ట్యాక్సీవాలా.. ఒక రైడ్ వేస్కోవచ్చు!

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre