టాక్సీవాలా ఆగమనం అప్పుడే...

Mon May 21 2018 17:25:59 GMT+0530 (IST)

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి ‘టాక్సీవాలా’ సినిమా రిలీజైపోయి ఉండాలి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం జరగడంతో ఈ నెల 18కి రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా సంగతి చెప్పారు కానీ.. రిలీజ్ ఎప్పుడో పక్కాగా చెప్పలేదు చిత్ర బృందం. ఐతే ఈ రోజు ఈ విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. జూన్ రెండో వారంలో ‘టాక్సీవాలా’ రిలీజవుతుందని ప్రెస్ నోట్ ఇచ్చారు. బహుశా జూన్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయొచ్చు. ముందు వారం రజినీకాంత్ ‘కాలా’తో పాటుగా హాలీవుడ్ మూవీ ‘జురాసిక్ వరల్డ్: ది ఫాలెన్ కింగ్డమ్’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. వాటి సందడి ముగిశాక ‘టాక్సీవాలా’ థియేటర్లలోకి అడుగుపెడతాడు. కానీ జూన్ 14కు ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్న సినిమాల సంగతేంటన్నదే చూడాలి.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’తో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’ కూడా 14కే రావాల్సి ఉంది. కానీ వాటి సంగతి పక్కాగా తేలట్లేదు. ‘టాక్సీవాలా’ ఆ రోజుకే ఫిక్సయితే ‘సమ్మోహనం’ రేసు నుంచి తప్పుకునే అవకాశముంది. మరోవైపు ఈ శుక్రవారానికి షెడ్యూల్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘నా నువ్వే’ జూన్ 1కి వాయిదా పడినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ 25 నుంచి 1కి ‘ఆఫీసర్’ సినిమా వాయిదా పడింది. మరి కళ్యాణ్ రామ్ సినిమాను కూడా అలాగే ఎందుకు పోస్ట్ పోన్ చేశారో తెలియదు. ఈ శుక్రవారం రవితేజ ‘నేల టిక్కెట్టు’ రావడం పక్కా. దీంతో పాటు ‘నా నువ్వే’ రాని పక్షంలో నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ లో ‘మహానటి’ హవా సాగుతున్న సంగతి తెలిసిందే.