Begin typing your search above and press return to search.

లవర్ బాయ్ ఇలా అయిపోయాడేంటి..?

By:  Tupaki Desk   |   25 Aug 2016 7:30 PM GMT
లవర్ బాయ్ ఇలా అయిపోయాడేంటి..?
X
ఇప్పుడు లవర్ బాయ్ అంటే నాగచైతన్య లాంటి వాళ్లు కనిపిస్తున్నారు కానీ.. పదేళ్ల కిందట అయితే ఆ మాటెత్తగానే తరుణే గుర్తొచ్చేవాడు. నువ్వే కావాలి.. ప్రియమైన నీకు.. నువ్వు లేక నేను లేను లాంటి సినిమాలతో అలాంటి గుర్తింపు సంపాదించాడు తరుణ్. ఐతే యూత్‌ లో మాంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణ్ కెరీర్లో ఉన్నట్లుండి ఫ్లాపులు మొదలయ్యాయి. అవి ఎంతకూ ఆగకపోవడంతో ఒక దశలో ఇండస్ట్రీ నుంచే అంతర్ధానం అయిపోయాడతను. ఇక మళ్లీ సినిమాలు చేయడనుకుంటుండగా ఈ ఏడాది జనవరిలో తన పుట్టిన రోజు సందర్భంగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు తరుణ్.

ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా వార్తల్లో లేదు. ఇప్పుడు మళ్లీ సినిమా అప్ డేట్స్ మీడియాతో పంచుకున్నాడు తరుణ్. ఈ సినిమా కోసం లడక్ లో పాటలు తీశారట. అక్కడి ఆన్ లొకేషన్ ఫొటోల్ని మీడియాకు షేర్ చేశారు. తరుణ్ సినిమా మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోందీ ఈ ఫొటోల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఐతే ఆ ఫొటోల్లో తరుణ్ లుక్ చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తోంది. గత కొన్నేళ్లలో సినిమాలు చేయకపోవడం వల్లేమో లుక్ గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్లున్నాడు తరుణ్. జుట్టు పోయింది.. ముఖంలో గ్లామర్ తగ్గింది. ఒకప్పటి కాన్ఫిడెన్స్.. ఉత్సాహం.. ఛార్మ్.. అతడి ముఖంలో కనిపించట్లేదు. మరి తరుణ్ తెరమీద ఎలా కనిపిస్తాడో చూడాలి. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ సరసన తమిళమ్మాయి ఒవియా కథానాయికగా నటిస్తోంది.