ట్రైలర్ టాక్: నన్నెవరో తెలివిగా ఇరికించారు

Tue Feb 12 2019 14:58:45 GMT+0530 (IST)

తాప్సీ పన్ను.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'బద్లా'.  గతంలో 'పింక్' చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ మరోసారి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఈ సినిమా స్పానిష్ ఫిలిం 'ది ఇన్విజిబుల్ గెస్ట్' కు అఫీషియల్ రీమేక్.  'కహాని' ఫేమ్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలయింది.2.21 నిముషాల నిడివి గల ఈ ట్రైలర్ లో సినిమా ప్లాట్ ఏంటి అనేది చూపించారు.  "బద్లా లేనా.. ఏ బాత్ సహీ నహీ హోతా. లేకిన్ అభి మాఫ్ కర్నా.. ఏ బాత్ భీ సహీ నహీ హోతా" అనే అమితాబ్ బేస్ వాయిస్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. అర్జున్ మర్డర్ కేస్ లో నిందితురాలయిన తాప్సీ..  నలభై ఏళ్ళుగా అపజయం ఎరుగని సీనియర్ లాయర్ అయిన అమితాబ్ మధ్య జరిగే కథే ఈ 'బద్లా'.  కేసు వాదించే సమయంలో తనకు అన్నీ నిజాలే చెప్పాలని కోరతాడు అమితాబ్.  పెళ్లై ఒక బాబు ఉన్నప్పటికీ అర్జున్ అనే యువకుడితో మూడు నెలల పాటు కలిసి ఉన్నానని.. ఎవరికో తెలియడంతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. అర్జున్ ను నేను హత్యచేయలేదని చెప్తుంది.

అమితాబ్ తనకు మూడు ప్రశ్నలున్నాయని అడుగుతారు.  అర్జున్ మెసేజ్ నీ సెల్ ఫోన్ లోకి ఎలా వచ్చింది?.. డబ్బు కోసం వచ్చిన బ్లాక్ మెయిలర్ డబ్బు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? తాళం వేసి ఉన్న గదిలోకి అతనెలా వచ్చాడు.. ఎలా తిరిగి వెళ్ళాడు?..  ఈ హత్యలో ఎవరో నన్ను తెలివిగా ఇరికించారని అంటుంది తాప్సీ. మరి మర్డర్ ఎలా జరిగింది.. నిజంగా తాప్సీ నిర్దోషా లేదా అన్నది సినిమాలోనే తెలుస్తుంది.  ఎప్పటిలాగానే అమితాబ్.. తాప్సీ నటన టాప్ క్లాస్.  సినిమాటోగ్రఫి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ సినిమాకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి.   ఓవరాల్ గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది ట్రైలర్.  ఈ సినిమా మార్చ్ 8 న రిలీజ్ కానుంది.  మరి అంతలోపు ట్రైలర్ ను తిలకించండి.