దిగ్గజ నటుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Wed Sep 26 2018 14:24:49 GMT+0530 (IST)

నానా పటేకర్.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరు. వ్యక్తిగతంగా కూడా ఆయనకు చాలా మంచి పేరుంది. రైతుల కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప ఇమేజ్ తెచ్చుకున్నాడు నానా. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ లాంటి సినిమాల్లో ఒకప్పుడు అందాల విందు చేసిన ఒకప్పటి హాట్ హీరోయిన్ తనూశ్రీ దత్తా నానాపై ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.పదేళ్ల కిందట నానాతో కలిసి తాను నటించిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ షూటింగ్ టైంలో నానాతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తనూశ్రీ ఆరోపించింది. నానా మహిళలతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని.. ఈ విషయంలో ఇండస్ట్రీలోని జనాలందరికీ తెలుసని.. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరని ఆమె పేర్కొంది. నానా మహిళల్ని కొడతాడని.. లైంగికంగా వేధిస్తాడని.. ఇంకా వాళ్లతో చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తాడని. కానీ ఇంతవరకు ఏ మీడియాలో కూడా దీని గురించి వార్త రాలేదని తనూశ్రీ అంది.

‘ఓకే హార్న్ ప్లీజ్’ షూటింగ్ టైంలో తనను నానా లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. ఐతే నానా చాలా పేరున్న వ్యక్తి కావడంతో ఇలాంటి వ్యవహారాలు బయటికి రావని ఆమె పేర్కొంది. నానా రైతుల కోసం చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తే.. ఇలాంటివన్నీ కేవలం షో మాత్రమే అని.. జనాల్లో మంచి ఇమేజ్ కోసం చేస్తారని విమర్శించింది. అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లలో నానా పటేకర్ తో సినిమాలు చేశాడని.. రజనీకాంత్ సైతం ‘కాలా’లో నానాతో కలిసి నటించాడని.. ఇంత పెద్ద హీరోలు ఆయనతో సినిమా చేస్తే ఇక ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారని.. తనకు ఆ ఆశ కూడా చచ్చిపోయిందని తనూశ్రీ పేర్కొంది. మరి ఈ ఆరోపణలు.. విమర్శలపై నానా ఏమంటాడో చూడాలి.