Begin typing your search above and press return to search.

జేబు నింపుకోవ‌డానికే ఆ సినిమాలు!

By:  Tupaki Desk   |   22 Sep 2019 2:30 PM GMT
జేబు నింపుకోవ‌డానికే ఆ సినిమాలు!
X
సినిమాల్లో మాత్ర‌మే నెగెటివ్ పాత్ర‌లు చేస్తాను కానీ నా ఆలోచ‌న‌ల‌న్నీ పాజిటివ్ గానే వుంటాయి అంటున్నారు మ‌న తోట‌రాముడు త‌నికెళ్ల భ‌ర‌ణి. తెలుగు చ‌ల‌న చిత్ర గ‌మ‌నాన్ని మార్చిన `శివ‌` చిత్రానికి మాట‌లు అందించిన‌ ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 750 పైచిలుకు చిత్రాల్లో న‌టించారు. ర‌చ‌యిత‌గా- క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా- ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల‌ తిరుప‌తి మ‌హిళా యూనివ‌ర్శిటీలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌నికెళ్ల భ‌ర‌ణి ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాల్ని కాలేజ్ విద్యార్థినుల‌తో పంచుకున్నారు. విల‌నిజాన్ని ప‌లికించే పాత్ర‌ల్ని అమితంగా ఇష్ట‌ప‌డే ఆయ‌న అలా అని త‌న ఆలోచ‌న‌లు కూడా అలా వుండ‌వ‌ని - చాలా పాజిటివ్‌ గా ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు.

స్వ‌త‌హాగా ర‌చ‌యిత అయిన ఆయ‌న జేబు నింపుకోవ‌డానికి సినిమాలు.. మ‌న‌స్సు నింపుకోవ‌డానికి ర‌చ‌న‌లు అంటూ చ‌మ‌త్క‌రించారు. క‌విత్వాన్ని వివ‌రిస్తూ త‌న భార్య‌కు మంత్రాలు తెలుస‌ని ఓ క‌విత్వం రాశారు. త‌న‌లోని ఆధ్యాత్మిక‌త‌ను తెలిజేస్తూ దేవుడిని పూజించండి. త‌ల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. తోటివారిలో దేవుడిని చూడండి అంటూ వేదాంతం వ‌ల్లె వేశారు. అయితే త‌ను పోషించిన ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో త‌న‌ని ఇప్ప‌టికీ వెంటాడుతున్న పాత్ర మాత్రం `మాతృదేవోభ‌వ‌` చిత్రంలోనిద‌ని.. ఆ పాత్ర చేసినందుకు ఇప్ప‌టికీ బాధ‌గానే వుంద‌ని భ‌ర‌ణి చెప్పుకొచ్చారు.

ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది అనుభ‌వం ఇదే. జేబు నింపుకోవ‌డానికి చేసేవి వేరు. మ‌న‌సు నింపుకోవ‌డానికి చేసేవి వేరు. కొంద‌రు న‌టీన‌టులు డ‌బ్బు కోసం ఏది ప‌డితే అది చేసేయ‌లేరు. ముఖ్యంగా కొంత సీనియారిటీ వ‌చ్చాక రొటీన్ మూస పాత్ర‌ల్ని అంగీక‌రించ‌లేరు. వంద‌లాది చిత్రాల‌కు ప‌ని చేసిన అనుభ‌వ‌జ్ఞులైన న‌టులకు ఈ త‌ర‌హా సందిగ్ధ‌త ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.కేవ‌లం నిల‌దొక్కుకునేందుకు అందివ‌చ్చిన ప్ర‌తిదీ చేసేవాళ్ల‌ను భ‌ర‌ణి కోణంలో టాలీవుడ్ లో చూడొచ్చు.