Begin typing your search above and press return to search.

హీరోలపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   25 Aug 2016 8:20 AM GMT
హీరోలపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
X
హీరోల అభిమానుల మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో దాడిచేసుకుని - ఒక వ్యక్తి మరణించే స్థాయికి వెల్లిన ఘటనపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో పూర్తి బాద్యత హీరోలదే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తమ్మారెడ్డి.. హీరోల అభిమానుల మధ్య జరిగే చిన్నచిన్న వివాదాలను మొగ్గలోనే తుంచేయాలని అన్నారు. తిరుపతికి చెందిన పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ హత్య ముూర్ఖత్వానికి పరాకాష్ట అని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో హీరోలు - అభిమానులు - పరాకాష్ట విషయాలపై హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి.

అయితే వినోద్ మృతి విషయంలో మాత్రం తీవ్రంగా స్పందించిన తమ్మారెడ్డి.. "గొడవలు పడొద్దు" అని అప్పుడప్పుడూ స్టేజీలపైకి ఎక్కి చెప్పినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ హీరోలంతా ముందుకువచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమ కాలంలో కూడా అభిమానులు - అభిమాన సంఘాలూ ఉండేవని - కానీ ఇలాంటి దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. తాను, దాసరి నారాయణ వంటి పెద్దవాళ్లు చెబితే వినే పరిస్థితి ప్రస్తుత కాలంలో హీరోలు లేరని, ఇప్పుడంతా "చెట్టు పేరు చెప్పుకొని తిరిగే హీరోలు ఎక్కువగా ఉన్నారని" తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన అభిమాన హీరోలకు సంబందించి ఎవరు గొప్ప అనే విషయలపై డిస్కషన్స్ రావడం - అది ఏకంగా కత్తులతో దాడిచేసుకునే స్థాయికి చేరడం వంటి ధారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. చిరంజీవి - బాలయ్య - నాగార్జున - వెంకటేష్ వంటి అగ్రహీరోలు ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంలో... అభిమానులు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి, హీరోల మధ్య కూడా ద్వేషాలు పెరగటానికి ఇప్పటి సినిమాల్లో వచ్చే పిచ్చి పిచ్చి డైలాగులు కూడా కారణమని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నేటి హీరోలంతా బాగా చదువుకున్నవాళ్లేనని, అటువంటి పిచ్చి పిచ్చి డైలాగుల పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయం వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి అన్నారు.