భారతరత్న.. లక్ష్మీపార్వతివల్లేనట!

Mon Feb 11 2019 22:29:16 GMT+0530 (IST)

సీనియర్ ఫిలింమేకర్ తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నాగబాబు మాదిరిగానే సినీమా ఇండస్ట్రీలో జరిగే పరిణామాలపై.. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటారు. నాగబాబులాగానే అనగానే అవన్నీ వివాదాలని మీరు ఫిక్స్ కావాల్సిన పని లేదు. కానీ ఈసారి మాత్రం తన అభిప్రాయం వివాదాస్పదంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  భారతరత్న ఆయన ఎంచుకున్న టాపిక్.  అసలే ఈమధ్య ఒక మతంవారికే ప్రాతినిథ్యం వహించేలా వ్యవహరించే ఓ మహానుభావుడు రీసెంట్ గా ఒక కులం వారికే భారతరత్నలు ఎక్కువగా ఇచ్చారని తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ తమ్మారెడ్డి  చెప్పే విషయం అలాంటిది కాదు లెండి.  తమ్మారెడ్డి తన వీడియోలో ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు రాలేదనే విషయంలో తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారే కారణమని ఆయన అనుమానమట.

అయన వీడియోలో మాట్లాడుతూ "ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు అని ఓ వార్త చూశా. ఇక్కడే నాకు ఒక అనుమానం వస్తోంది. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పానని.. ప్రధానిగా అవకాశం వచ్చినా వదులుకున్నానని అంటూ ఉంటారు.  నిన్నమొన్నటివరకు ఆయన ఎన్డీయేలో భాగస్వామిగానే ఉన్నారు. అలాంటి వ్యక్తి నిజంగా ప్రయత్నిస్తే ఎన్టీఆర్ కు భారరత్న వచ్చేలా చేయడం పెద్ద విషయం కాదు. కానీ చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు లేరని నాకు అనుమానం కలుగుతోంది."

"ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించడం కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా అవార్డులు ప్రకటించిన మరుసటిరోజున ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వలేదంటూ రొటీన్ గా ఒక స్టేట్మెంట్ పడేస్తారు.  అయన గట్టిగా ప్రయత్నించకపోవడానికి ఒక కారణం ఉంది.   ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే ఆ కార్యక్రమానికి ఫ్యామిలీ మొత్తం వెళ్లాలి. ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీపార్వతి ఆ అవార్డు స్వీకరించాల్సి ఉంటుంది. లక్ష్మీపార్వతి భారతరత్న అవార్డు తీసుకోవడం వీళ్ళందరికీ ఇష్టం లేదు. అందుకే చంద్రబాబే ఎన్టీఆర్ భారతరత్నని అడ్డుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి."

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం ఇష్టం లేకుంటే ప్రతి ఏడాది ఇలా రొటీన్ డైలాగులు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. అది ఎన్టీఆర్ ను అగౌరవపరచడమేనని అయన అన్నారు. అసలే ఎన్టీఆర్ బయోపిక్ వచ్చిన తర్వాత చాలామంది ఎన్టీఆర్ గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. 22 ఏళ్ళపాటు ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడని వారు కూడా ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ సాధించినవి ఎవ్వరూ మర్చిపోకూడదన్నారు. సినిమారంగంలో అయన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాజకీయాలయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే అధికారం చేపట్టారని.. దేశంలో ఒక బలమైన సీఎం గా ఎదిగారని అన్నారు. అయన గురించి తప్పుగా మాట్లాడడం తగదన్నారు.