సూపర్ స్టార్ ని మోసం చేసిన సందర్భం

Wed May 16 2018 12:09:19 GMT+0530 (IST)

కొన్ని జ్ఞాపకాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలా మస్తిష్కంలో మిగిలిపోతాయి. అలాంటి చేదు ప్లస్ తీపి కలగలిసిన ఒక మెమరీని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పంచుకున్నారు. 90వ దశకంలో కృష్ణ హీరోగా తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో రౌడీ అన్నయ్య అనే సినిమా ఒకటి తీసారు. నెంబర్ వన్ లాంటి సూపర్ హిట్స్ తో అప్పుడు కృష్ణ గారు సూపర్ ఫాంలో ఉన్నారు. తమ్మారెడ్డికి కూడా దర్శకుడిగా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది కాబట్టి ఈ మూవీకి క్రేజ్ కూడా బాగానే వచ్చింది. రౌడీ అన్నయ్య క్లైమాక్స్ కు ముందు ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేసారు తమ్మారెడ్డి. అందులో సిల్క్ స్మితతో పాటు క్యారెక్టర్ అరిస్ట్ బాబు మోహన్ కూడా ఉంటాడు. అప్పుడు ఈ ట్రెండ్ ఉధృతంగా నడుస్తోంది. కాని హీరో పాత్రధారి అయిన నేను లేకుండా ఆ పాట తీస్తే ఫాన్స్ ఒప్పుకోరు అని కృష్ణ గారు అభ్యంతర పెట్టారు. అలా చేస్తే బాగోదు అని తమ్మారెడ్డి అభిప్రాయం. ఏం చేయాలో పాలుపోక చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు.పగలు కృష్ణ గారితో రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే క్లైమాక్స్ ముందు వచ్చే ఈ ఐటెం సాంగ్ మాత్రం సాయంత్రం పూట ఆయనకు తెలియకుండా షూట్ చేసారు తమ్మారెడ్డి. సెన్సార్ కు వెళ్ళినప్పుడు సరిగ్గా ఈ పాట దగ్గరే అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని కృష్ణ గారు అప్పటి కమిటిలో ఉన్న సుబ్బరామిరెడ్డి గారిని అడిగితే ఆయన ఇదండీ విషయం అంటూ ఆ పాటను కృష్ణను చూపించారు. అంతే తనను మోసం చేసినట్టుగా ఫీల్ అయిన కృష్ణ గారికి కోపం వచ్చి అక్కడే తమ్మారెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇకపై బ్రేక్ అప్ అని చెప్పి వెళ్లిపోయారట. ఇది కాస్త బయటికి పొక్కి కృష్ణ ఫాన్స్ ఆగ్రహంతో తమ్మారెడ్డి గారి ఆఫీస్ మీదకు దాడి చేసారు. ఫలితంగా పోలీసు కేసులు. కొంత కాలం తమ్మారెడ్డి-కృష్ణ మధ్య అగాధం అలాగే ఉండిపోయింది. తన అభిమానుల మీద పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోమని కృష్ణ స్వయంగా చెప్పడంతో అక్కడి నుంచి ఆ ఇద్దరికీ మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోయింది. ఈ అనుభవాన్ని తమ్మారెడ్డి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోలతో అభిమానులతో డీల్ చేసే విషయంలో ఏదైనా చిక్కులు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో.అన్నట్టు రౌడీ అన్నయ్య ఆ పాట లేకుండానే విడుదల కావడం సూపర్ హిట్ గా మిగలడం జరిగిపోయాయి. అందులో రంభ హీరొయిన్.