Begin typing your search above and press return to search.

వర్మ సక్సెస్ అయ్యాడబ్బా..

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:13 AM GMT
వర్మ సక్సెస్ అయ్యాడబ్బా..
X
రామ్ గోపాల్ వర్మ కొన్నిసార్లు వితండవాదం చేయొచ్చు.. కొన్నిసార్లు శ్రుతి మించి వ్యాఖ్యానాలు చేయొచ్చు. కానీ కొన్ని సార్లు ఆయన వాదనలు భలేగా ఉంటాయి. చాలామంది బయటికి మాట్లాడటానికి సాహసించని అంశాలపై బోల్డ్‌గా తన అభిప్రాయం చెప్పేస్తాడు వర్మ. ఈ విషయంలో మెజారిటీ అభిప్రాయం గురించి ఆయనకు పట్టింపు ఉండదు. తన అభిప్రాయమేంటో తాను చెబుతాడు. జల్లికట్టుకు సంబంధించిన వివాదంపై వర్మ తాజా వ్యాఖ్యలు అలాంటివే. జల్లికట్టుకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క మాటా మాట్లాడ్డానికి సాహసించని పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా తన వాదన వినిపించి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

ఐతే జల్లికట్టు విషయంలో వీరావేశంతో ఉన్న తమిళ జనాలు వర్మ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు సెలబ్రెటీలు సైతం వర్మపై దాడి మొదలుపెట్టారు. సూర్యతో ‘రాక్షసుడు’ సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు.. వర్మ మీద వెటకారాలకు దిగాడు. జల్లికట్టుకు మద్దతుగా నిలుస్తున్న వాళ్లలో ఒక్కొక్కరి వెనుక వందల గేదెల్ని తరమాలని.. అప్పుడు వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందని వర్మ వ్యాఖ్యానిస్తే.. ‘‘ఒకసారి అలగనూర్ వరకు వచ్చి వెళ్లండి సార్. ఇక్కడొచ్చి మీ అభిప్రాయమేంటో మా కుర్రాళ్లకు చెప్పండి. వాళ్ల ఫీలింగేంటో వినండి. మీ కోసం మేం ఎదురు చూస్తున్నాం’’ అన్నాడు వెంకట్. అంటే అక్కడికి వెళ్తే తమ కుర్రాళ్లు వర్మను వాయించి వదిలి పెడతారన్నది వెంకట్ ఉద్దేశం కావచ్చు. వర్మ తనదైన స్టయిల్లో ఒక తికమక మెసేజ్ ఒకటి పెట్టగా.. ఎవరైనా దీనికి అర్థమేంటో చెప్పండి ప్లీజ్ అంటూ వెంకట్ ప్రభు వ్యాఖ్యానించడం విశేషం. తమిళ హీరో జై.. ఈ మెసేజ్ ను ఉద్దేశించి ఏవో వెటకారాలు ఆడాడు. ఇక పిజ్జా సినిమాతో గొప్ప పేరు సంపాదించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. వర్మ ట్వీట్ ఒకదాన్ని ఉద్దేశించి.. ‘‘నువ్వు మా లిస్టులోనే లేవుగా గోపాలూ..’’ అంటూ వర్మపై వెటకారాలాడాడు. ఇంకా పలువురు తమిళ సెలబ్రెటీలు వర్మపై విమర్శలు.. వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వర్మ ఓపెన్ గా నిజాలు మాట్లాడేసి.. తమిళ సెలబ్రెటీల తీరును ఎండగట్టేసరికి వాళ్లకు బాగానే కాలిందని వారి మాటల్ని బట్టి అర్థమైంది. మొత్తానికి జల్లికట్టు విషయంలో వర్మ సక్సెస్ అయ్యాడనడానికి ఇది రుజువు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/