Begin typing your search above and press return to search.

తాప్సి టాలెంటు మనోళ్లకు ఆనట్లేదు

By:  Tupaki Desk   |   19 Aug 2017 6:17 PM GMT
తాప్సి టాలెంటు మనోళ్లకు ఆనట్లేదు
X
బాలీవుడ్ వెళ్లిపోగానే దక్షిణాది సినిమాల మీద కౌంటర్లు వేసేసింది తాప్సి. దక్షిణాది ఇండస్ట్రీల వాళ్లు తన టాలెంటుని సరిగా వాడుకోలేదని.. ఇక్కడ తనకన్నీ గ్లామర్ పాత్రలే ఇచ్చారని నిట్టూర్చింది. బాలీవుడ్లో ఆమె నటించిన ‘బేబీ’.. ‘పింక్’.. ‘నామ్ షబానా’ చాలా మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో దక్షిణాది ఇండస్ట్రీల మీద.. ముఖ్యంగా టాలీవుడ్ పై సెటైర్ల దాడి మరింత పెంచింది. ఈ మధ్యే రాఘవేంద్రరావు మీద ఆమె ఎలాంటి కౌంటర్లు వేసిందో తెలిసిందే. దర్శకేంద్రుడినే అంతేసి మాటలు అన్నాక తాప్సి తెలుగులో చేసిన సినిమా ‘ఆనందో బ్రహ్మ’ మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ లాంటి పరిశ్రమల్లో హీరోయిన్లను గ్లామర్ కోసమే వాడుకుంటారన్నది తాప్సి ప్రధాన ఆరోపణ.

మరి బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగులో తాప్సి ఓ సినిమా చేసిందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని.. ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఘాజీ’లో కానీ.. లేటెస్టుగా రిలీజైన ‘ఆనందో బ్రహ్మ’లో కానీ తాప్సి పాత్రలకు ఏమంత ప్రాధాన్యం లేదు. ‘ఘాజీ’లో మరీ కరివేపాకు లాంటి పాత్ర ఆమెది. ‘ఆనందో బ్రహ్మ’లో పరిస్థితి కొంచెం మెరుగే కానీ.. ఇందులో కూడా అంత ప్రత్యేకమైన పాత్ర అయితే కాదు. సినిమాలో వెన్నెల కిషోర్.. షకలక శంకర్ లాంటి కమెడియన్లు హైలైట్ అయ్యారు తప్ప పోస్టర్లలో ప్రధానంగా కనిపించిన తాప్సి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెది ఇందులో గెస్ట్ రోల్ అని చెప్పాలి. ఆరంభంలో.. చివర్లో తప్ప తాప్సి పెద్దగా హైలైట్ అయింది లేదు. చాలా వరకు దయ్యం గెటప్ వేసుకుని భయపెట్టే ప్రయత్నం చేయడం తప్పితే.. ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూపించే ఛాన్సే దక్కలేదు. మొత్తానికి ఓవైపు బాలీవుడ్డోళ్లు తాప్సిలోని టాలెంటంతా బయటికి తీస్తుంటే.. పాపం మనవాళ్లే అమ్మడి టాలెంటుని గుర్తించట్లేదు. తన స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు. అయినా ఇలాంటి పాత్రలు ఏరికోరి తాప్సి ఎందుకు చేస్తోందో మరి?