Begin typing your search above and press return to search.

ఆనందో బ్రహ్మ.. ఎగిరి గంతెయ్యాలా?

By:  Tupaki Desk   |   16 Aug 2017 10:30 AM GMT
ఆనందో బ్రహ్మ.. ఎగిరి గంతెయ్యాలా?
X
ఈ రోజుల్లో పెద్ద సినిమాలు సైతం పోటీ లేకుండా సోలోగా రిలీజవడం అరుదైపోతోంది. గత శుక్రవారం ఒకే రోజు మూడు మీడియం రేంజి సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. ఇక మీడియం-పెద్ద రేంజి సినిమాలు లేని రోజుల్లో అయితే పోటీ ఇంకా గట్టిగా ఉంటుంది. ఏదైనా చిన్న సినిమా రేసులో ఉంటే.. దానికి పోటీకి ఇంకో రెండు మూడు సినిమాలు పోటీలోకి వచ్చేస్తుంటాయి. చిన్న సినిమా ఏదైనా సోలోగా రిలీజవడం అన్నది అరుదు. ఈ అరుదైన అవకాశాన్నే దక్కించుకుంది ‘ఆనందో బ్రహ్మ’. వచ్చే శుక్రవారం ఈ చిత్రం సోలోగా రిలీజవుతుండటం విశేషం. ఆగస్టు 18కి అనుకున్న మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా సైడైపోవడంతో దీనికి వరమైంది.

ముందు గోపీచంద్ సినిమా ‘ఆక్సిజన్’ను ఆగస్టు 18కి అనుకున్నారు. అది అతీ గతీ లేకుండా పోయింది. తర్వాత సునీల్ మూవీ ‘ఉంగరాల రాంబాబు’ రేసులోకి వచ్చింది. అది కూడా వెనక్కి వెళ్లిపోయింది. చివరికి డబ్బింగ్ సినిమా ‘వీఐపీ-2’ను 18న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి.. ఇప్పుడు దాన్ని కూడా 25కు వాయిదా వేశారు. మొత్తానికి అన్నీ పక్కకు వెళ్లిపోవడంతో సోలో బ్యాటింగ్ కు రెడీ అయిపోయింది ‘ఆనందో బ్రహ్మ’. అంతమాత్రాన ఈ సినిమా మేకర్స్ ఎగిరి గంతెయ్యాల్సిన పనేమీ లేదు.

ఎందుకంటే.. గత శుక్రవారం రిలీజైన మూడు సినిమాల్లో దేనికీ నెగెటివ్ టాక్ రాలేదు. దేని స్థాయిలో అవి బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. రెండో వీకెండ్లోనూ ఈ సినిమాలకు చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చే అవకాశముంది. జనాల దృష్టి ఇంకా వాటి మీదే ఉంది. మరోవైపు ‘ఆనందో బ్రహ్మ’లో స్టార్ కాస్ట్ లేకపోవడం మైనస్. పైగా ఈ సినిమా తీసిన దర్శకుడు మహి.కె.రాఘవ్ గురించి కూడా జనాలకు పెద్దగా తెలియదు. దయ్యాల్ని మనుషులు భయపెట్టడం అనే పాయింట్ డిఫరెంటే కానీ.. ఆ విషయం మినహాయిస్తే మిగతా అంతా మామూలు హార్రర్ కామెడీల్లాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్లలో ఉన్న మూడు సినిమాల పోటీని తట్టుకుని ‘ఆనందో బ్రహ్మ’ ఎలా నిలబడుతుందో చూడాలి.