ఝూన్సీ సూసైడ్ వెనుక షరతుల ప్రేమ?

Mon Feb 11 2019 11:13:01 GMT+0530 (IST)

టీవీ నటి నాగఝూన్సీ ఆత్మహత్య ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రేమికుడితో వచ్చిన విభేదాల్ని తట్టుకోలేని ఆమె.. ప్రాణాల్ని తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ కేసు విషయమైన దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఝూన్సీ ప్రియుడు సూర్యతేజను విచారించారు.ఈ సందర్భంగా కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు.. పలువురిని విచారించిన నేపథ్యంలో ఝూన్సీ.. సూర్యతేజ ప్రేమకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత సూర్యతేజ పలు కండిషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. సహచర నటులతో కలుపుగోలుగా మాట్లాడటాన్ని ఇష్టపడేవాడు కాదు. అనుమానంతో రగిలిపోవటం.. సీరియల్స్ లో నటించటం మానేయాలన్న ఒత్తిడి తేవటం.. ఎవరితోనూ మాట్లాడొద్దన్న షరతులు పెట్టటం లాంటివి చేసేవాడని చెబుతున్నారు.

తాను చెప్పింది వినాలని.. తన మాటకు విలువనిచ్చి షూటింగులకు వెళ్లొద్దనేవాడు. అయితే.. సూర్యతేజ మాట వినకుండా ఝూన్సీ షూటింగుల్లో పాల్గొనేది. ఈ సందర్భంగా ఫోన్లు చేస్తే ఆమె కట్ చేయటమో.. స్విచ్చాఫ్ చేయటమో చేసేవారు.   ఇలాంటివి సూర్యకు మరింత అనుమానాన్ని.. ఆగ్రహాన్ని కలిగించేవని చెబుతున్నారు. ఝూన్సీకి రిటార్ట్ ఇచ్చే క్రమంలో ఆమె ఫోన్లకు బదులివ్వకుండా ఉండటం.. తక్కువగా మాట్లాడటం.. మెసేజ్ లకు రిప్లై ఇవ్వకపోవటం లాంటివి చేసేవాడు.

అతడి వైఖరితో ఒత్తిడి పెరిగిపోయి.. ఆవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణంగా మారిందంటున్నారు. ఝూన్సీ ఆత్మహత్య విషయంలో అందరి అనుమానాలు నాగసూర్య మీదనే ఉండటం.. అవి అంతకంతకూ పెరుగుతున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా తన కుమార్తె ఆత్మహత్యకు సూర్యనే కారణంగా తల్లి సంపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సూర్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పలు అంశాలు తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఝూన్సీ డైరీలో ఏముంది?

సూర్యకు.. నాగ ఝూన్సీకి పరిచయం ఎలా జరిగింది?  సూర్య బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయాల్ని ఆమె డైరీలోని వివరాలతో పాటు.. విచారణలో సేకరించిన అంశాలతో పోలీసులు సరిపోల్చినట్లుగా తెలుస్తోంది. విజయవాడకు చెందిన 30 ఏళ్ల సూర్య బెజవాడలోనే మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితం ఝూన్సీతో అతనికి పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ప్రేమగా మారింది. ఆ విషయాన్ని ఝూన్సీ తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. అయితే.. సూర్య కుటుంబ సభ్యులు మాత్రం ఆమెతో పెళ్లికి అభ్యంతరం చెప్పినట్లుగా తెలుస్తోంది. సూర్యతో ప్రేమలో పడ్డాక ఝూన్సీ నటనకు దూరమైంది. కొద్దికాలం క్రితం స్నేహితురాలితో కలిసి అమీర్ పేటలో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది.

సూర్య కోరుకున్నట్లుగా నటనకు దూరమైన తర్వాత కూడా అతడు దూరం పెట్టటాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి రెండు రోజుల ముందు కూడా ఆమె నెంబర్ ను సూర్య బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. సూసైడ్ చేసుకోవటానికి ముందు వేరే ఫోన్ తో సూర్యతో మాట్లాడే ప్రయత్నం చేసింది. బిజీగా ఉన్నాను.. మనసు బాగోలేదంటూ సూర్య ఫోన్ కట్ చేశాడు.

తాను చెప్పాలనుకున్న మాటల్ని అతడికి వాట్సాప్ ద్వారా పంపింది. కాసేపటికే డిలీట్ చేసినట్లుగా సమాచారం. సదరు మెసేజ్ చూసిన సూర్య (?) ఏడవొద్దు.. వస్తున్నాను అంటూ మెసేజ్ పెట్టాడని.. ఆ సమాచారం ఆమెకు చేరలేదని చెబుతున్నారు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఉరి వేసుకోవటమే కారణంగా తెలుస్తోంది. డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిపుణులతో దాన్ని విశ్లేషిస్తున్నారు. ఝూన్సీ నటించటం తనకు ఇష్టం లేదని.. మానుకోవాలని తాను పలుమార్లు చెప్పినట్లుగా సూర్య పోలీసులకు వెల్లడించారు.

ఆమె ఫోన్ ను తాను కొన్నిసార్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మాట నిజమేనని.. ఆత్మహత్యకు ముందు తనకు కొన్ని మెసేజ్ లు పెట్టి డిలీట్ చేసిందని.. ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారని సమాచారం. తన బైక్ కు ఝూన్సీ డబ్బులు ఇచ్చిందని.. తాను రూ.3లక్షలు ఝూన్సీ కుటుంబానికి ఇచ్చిన విషయాన్ని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.