Begin typing your search above and press return to search.

సైరా హిందీ బిజినెస్ రేంజ్ ఎంత‌?

By:  Tupaki Desk   |   14 Aug 2019 2:30 PM GMT
సైరా హిందీ బిజినెస్ రేంజ్ ఎంత‌?
X
2019 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ప్ర‌భాస్ `సాహో`.. చిరు `సైరా` పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. ఈ రెండిటిలో ముందుగా `సాహో` ఈనెల 30న రిలీజవుతోంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం 320కోట్ల మేర బిజినెస్ సాగించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో హిందీ రైట్స్ రూపంలో 80కోట్ల మేర బిజినెస్ సాగింద‌ని అప్ప‌ట్లో చెప్పుకున్నారు. ప్ర‌ఖ్యాత టీ-సిరీస్ అధినేత‌ భూషణ్ కుమార్ `సాహో` చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి` ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. దాదాపు 200 కోట్లు పైగా బ‌డ్జెట్ ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ పెట్టుబ‌డిగా పెడుతోంద‌ని ప్ర‌చార‌మైంది. మ‌రి ఆ మేర‌కు ప్రీరిలీజ్ బిజినెస్ సాగిందా? అంటే స‌రైన ఆన్స‌ర్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా బిజినెస్ ఇంత‌కు సాగింది? అన్న వివ‌రం అయితే తెలియ‌లేదు. అయితే `సైరా` చిత్రానికి దాదాపు 250 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ అధినేత రామ్ చ‌ర‌ణ్ ఆశిస్తున్నార‌ని తెలుస్తోంది. నేటి నుంచి సైరాకు సంబంధించి అస‌లైన ప్ర‌చారం ప్రారంభిస్తున్నారు. నేటి సాయంత్రం 3.45 గం.ల‌కు సైరా మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు.

ఈ హుషారులోనే సైరా- హిందీ హ‌క్కుల డీల్ పూర్తి చేయ‌డంపైనా టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సైరా హ‌క్కుల్ని బాహుబ‌లి హిందీ పంపిణీదారుడు క‌ర‌ణ్ జోహార్ కానీ.. `సాహో` హ‌క్కులు కొనుక్కున్న టీసిరీస్ అధినేత‌ల‌కు కానీ చేజిక్కించుకోలేదు. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో కం ద‌ర్శ‌కనిర్మాత ఫ‌ర్హాన్ అక్త‌ర్ .. సీనియ‌ర్ క‌థానాయిక ర‌వీనాటాండ‌న్ భ‌ర్త అనీల్ త‌డానీతో క‌లిసి `సైరా-హిందీ` హ‌క్కుల్ని చేజిక్కించుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ప్ర‌ఖ్యాత ఏఏ ఫిలింస్(రితేష్ సిధ్వానీ-అనీల్ త‌డానీ)- ఎక్సెల్ మీడియా(ఫ‌ర్హాన్) డిస్ట్రిబ్యూష‌న్ వింగ్ ఉత్త‌రాదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంద‌ని అధికారికంగా చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.

ఇక‌పోతే బాహుబ‌లి చిత్రాన్ని ఇదివ‌ర‌కూ క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి ఏఏ ఫిలింస్ సంస్థ కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేసింది. ఆ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ‌కు ఉన్న క‌రిష్మా దృష్ట్యా `సైరా` చిత్రాన్ని హిందీలో అంతే భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అక్టోబ‌ర్ 2న `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని తెలుగు-త‌మిళం-హిందీలో అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. అన్న‌ట్లు హిందీ హ‌క్కుల రూపంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ఎంత పెద్ద మొత్తం చేజిక్కించుకుంది? అన్న‌ది తెలియాల్సి ఉంది.