Begin typing your search above and press return to search.

సైరాకి క‌లిసొస్తున్న కేసీఆర్ హాలీడేస్

By:  Tupaki Desk   |   13 Oct 2019 5:30 PM GMT
సైరాకి క‌లిసొస్తున్న కేసీఆర్ హాలీడేస్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా- న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌లై తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మాత్రం సోసోనే అని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ మేనియా వ‌ర్క‌వుటైంది. ద‌స‌రా సెల‌వులు సైరాకి బాగా క‌లిసొచ్చాయి. మెగాస్టార్ సినిమా కావ‌డం...స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడి క‌థాంశం...సైరాకి పోటీగా మ‌రో సినిమా లేక‌పోవడంతో వ‌సూళ్ల‌ దూకుడు కొన‌సాగింది. ఓవ‌ర్సీస్ - ఉత్త‌రాది ఫ‌లితాలు నిరాశ‌పరిచినా సైరాకి తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లే కీల‌కంగా మారాయి. ఇదే సమ‌యంలో తెలంగాణ ఆర్టీసీ స‌మ్మెకు దిగ‌డంతో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ద‌స‌రా సెల‌వుల‌కు వ‌చ్చిన విద్యార్థులు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉన్న‌చోట‌నే సెల‌బ్రేట్ చేసుకున్నా తాజాగా మ‌రోసారి స‌మ్మె నేప‌థ్యంలో ఈ సెల‌వుల‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగించిన‌ట్లు కేసీఆర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వారం రోజులు కూడా స్కూళ్లు.. కాలీజీలు అన్నీ బంద్. దీంతో ఈ వారం తెలంగాణలో సైరాకు క‌లిసొచ్చే అంశ‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ స‌మ‌యం లేక సైరా చూడ‌ని విద్యార్థులంతా సినిమా టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటున్నారట‌. దాదాపు హైద‌రాబాద్ సిటీలో ఏ థియేట‌ర్ చూసినా విద్యార్థుల‌తోనే నిండిపోతోంది. ఇది కూడా ప్ర‌భుత్వాన్ని ప్ర‌తి ప‌క్షాలు దుమ్మెత్తి పోయ‌డంతోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అవి ద‌స‌రా హాలీడేస్ కాదు...కేసీఆర్ హాలీడేస్ అంటూ ముఖ్య‌మంత్రి ప‌నితీరుపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అటు స్కూళ్ల యాజ‌మాన్యాలు వారం రోజులు పాటు ఇష్టానుసారం సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో.... సిల‌బ‌స్ ఎప్పుడు పూర్తిచేస్తారు? అంటూ ప్ర‌భుత్వాన్ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. కొద్ది సేప‌టి క్రిత‌మే ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ ఆసుప‌త్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రాష్ట్రం అగ్ని గుండ‌గా మారే ప‌రిస్థితులున్నాయ‌ని భ‌ద్ర‌త‌ను పటిష్టం చేసారు.