Begin typing your search above and press return to search.

ఆ వెయ్యి థియేటర్లు వస్తే.. నిర్మాతలకు పండగే

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:18 AM GMT
ఆ వెయ్యి థియేటర్లు వస్తే.. నిర్మాతలకు పండగే
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత బాగా వుంది. కేవలం నలుగురి వ్యక్తుల చేతుల్లోనే మంచి థియేటర్ల వున్నాయనే ఆరోపణలు వున్నాయి. అందుకే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే... చిన్న సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నేడు టాలీవుడ్ లో వుంది. స్టార్ హీరో సినిమా విడుదలవుతోందంటే చాలు.. ఓ పదిహేను వందల థియేటర్లు కావాల్సిందే. సో.. వున్న 2500 థియేటర్లలో ఒక సినిమాకే ఇన్ని థియేటర్లు పోతే.. ఇక మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి? అలాగే ఓ చిన్న సినిమా విడుదలయితే.. సకల సౌకర్యాలుండే థియేటర్ దొరకడం కష్టంగా వుంది. సో.. ఇప్పుడు ఓ కంపెనీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెయ్యి మల్టీప్లెక్స్ థియేటర్లను కట్టడానికి ముందుకొచ్చింది. అంతేనా.. థియేటర్లు కట్టడంతోనే వారు చేతులు దులుపుకోవడం లేదు... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పనిచేసే కింది స్థాయి ఆర్టిస్టులకు.. వర్కర్లకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి.. వారిని ఆర్థికంగా స్థిరపడటానికి దోహదపడతాం అంటోంది ఆ సంస్థ.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ అనే ఓ సంస్థ ముందుకొచ్చింది. దాదాపు రూ.1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు స్వదేశీ గ్రూప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల సమస్యతో పాటు... చాలా చిత్రాలు విడుదల కాకుండానే ఆగిపోతున్నాయి. ఈ సమస్యను తీర్చేందుకు గాను తాము తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 1000 థియేటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. అమెరికాలో ప్రతి 7800 మందికి ఓ థియేటర్ ఉంది. అదే చైనాలో 40000 మందికి ఓ థియేటర్ ఉంది. అదే మన దేశంలో మాత్రం 98000 మంది జనాభాకు ఓ థియేటర్ మాత్రమే ఉంది. అందుకే థియేటర్ల సమస్యను అధిగ మించేందుకు 20 నుంచి 30 వేల జనాభాకు ఓ థియేటర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే చాలా థియేటర్లు కండీషన్ సరిగా లేక, టెక్నికల్ గా అప్ డేట్ కాలేక, నిర్వహణ ఖర్చులు భరించలేక గోడౌన్స్ గాను, మ్యారేజ్ హాల్స్ గా మారుతున్నాయి. అందుకే అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా థియేటర్ల రూపకల్పన చేస్తున్నాం. దీనికి సంబంధించిన భూసేకరణ కూడా జరుగుతోంది. ప్రత్యక్షంగా భూములు కొనడం లేదా లీజు విధానం - లేదా భాగస్వామ్య విధానం ద్వారా భూ సేకరణ చేస్తున్నాం’ అన్నారు.

అలాగే స్వదేశీ షాపింగ్ మాల్స్ లో రెండు థియేటర్లు - స్వదేశీ సూపర్ బజార్ - హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. ఈ సూపర్ బజార్ లో అమ్మే కూరగాయలు - నిత్యావవరస వస్తువులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి దాదాపు 10000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాం. వీటితో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ట్రేడ్ సెంటర్ - ఇంటర్నేషనల్ ఫిల్మ్ కన్వేషన్ సెంటర్ ను కూడా నిర్మించనున్నాం. సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ తో పాటు... పలు ప్రైవేటు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ఫిల్మ్ ట్రేడ్ సెంటర్ ద్వారా సినిమా వ్యాపారాన్ని సుహృద్భావ వాతావరణంలో చేసుకోవచ్చు. దీంతో పాటు 24 శాఖలకు సంబధించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తున్నాం. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను తలదన్నే రీతిలో ఈ ఇనిస్టిట్యూట్ ఉండబోతోంది. సినిమా అవకాశాల కోసం వేచి చూస్తున్న ఔత్సాహికులను ప్రోత్సహించబోతున్నాం. ఓ సినిమా ప్రారంభించినప్పటి నుంచి విడుదల చేసే వరకు తామే బాధ్యత వహించేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మంచి చిత్రాల్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం’ అన్నారు ఆయన.