ట్రైలర్ వస్తోంది.. లబ్ డబ్ లబ్ డబ్

Tue Jan 01 2019 20:00:01 GMT+0530 (IST)

గత ఏడాది తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగత తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా.. సీనియర్ డైరెక్టర్ బాలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే విడుదలైంది. టీజర్ కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. ఐతే ఆ టీజర్ చూసిన జనాలు పెదవి విరిచారు. ‘అర్జున్ రెడ్డి’తో పోలిస్తే ‘వర్మ’ పేలవంగా అనిపించింది. టీజర్ అసలు ఒరిజినల్ ను మ్యాచ్ చేయలేకపోయింది. ధ్రువ్ కు.. మన విజయ్ దేవరకొండకు పోలికే లేకపోయింది. ‘అర్జున్ రెడ్డి’ని చెడగొట్టేశారంటూ తమిళ జనాలే విమర్శలు గుప్పించే పరిస్థితి వచ్చింది. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ పాటికే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఈ టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లో ఏమో.. నెమ్మదించారు.మధ్యలో ప్రమోషన్ లేకపోవడం.. అసలే అప్ డేట్ ఇవ్వకపోవడంతో జనాలందరూ ఈ సినిమా గురించి పూర్తిగా మరిచిపోయారు. మధ్యలో సినిమాలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమో తెలియదు. కొంత విరామం తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 9న ‘వర్మ’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. సూర్య చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఐతే టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకుని ‘వర్మ’ టీం అంతా భయం భయంగా ఉంది. ట్రైలర్ కు కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తే సినిమా పరిస్థితేంటి.. ధ్రువ్ కు అరంగేట్రంలోనే తేడా జరిగితే ఎలా అని కంగారు పడుతున్నారు. అసలు ధ్రువ్ అరంగేట్రానికి ‘అర్జున్ రెడ్డి’ లాంటి ఇంటెన్స్ మూవీ రీమేక్ ను ఎంచుకోవడమే తప్పన్న అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. మరి ఈ అభిప్రాయల్ని దాటి సినిమా బాగా ఆడి ధ్రువ్ కు శుభారాంభాన్నందిస్తుందేమో చూడాలి.