Begin typing your search above and press return to search.

రియల్ హీరోస్ అనిపించారుగా

By:  Tupaki Desk   |   25 March 2018 4:24 AM GMT
రియల్ హీరోస్ అనిపించారుగా
X
తమిళనాట సమ్మె తీవ్రత అలాగే ఉంది. షూటింగులు ఆగిపోయాయి. కొత్త సినిమాలు లేక థియేటర్ యజమానులు లబోదిబోమంటున్నారు. కాని ఉద్దేశం మంచిది కావడంతో నిర్మాతలు మొదలుకొని డిస్ట్రిబ్యూటర్ల వరకు అందరూ దీనికి సహకరిస్తున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఆధిపత్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధానంపై ప్రత్యక్ష పోరాటానికి దిగిన కోలీవుడ్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేలా కనిపించడం లేదు. తాడో పేడో తేల్చుకోవడానికే దీన్ని ముందుండి నడిపిస్తున్న విశాల్ గట్టిగానే డిసైడ్ అయ్యాడు. ఇక నిర్మాతల భారాన్ని తగ్గించే క్రమంలో స్టార్ హీరోలు సూర్య, కార్తి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్త ప్రస్తుతం ప్రశంశలు అందుకుంటోంది. దాని ప్రకారం ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ వ్యక్తిగత సిబ్బందికి అయ్యే ఖర్చు, పారితోషికాలు అన్ని తామే భరించేలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఇదేమి చిన్న మొత్తం కాదు. షూటింగ్ వ్యవధిని బట్టి 25 నుంచి 40 లక్షల మధ్య ఉంటుంది. దాన్ని తామే భరించేలా సూర్య-కార్తి నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్త పట్ల నిర్మాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది అధికారికంగా వెలువడాల్సి ఉంది. విశాల్ కూడా ఇదే దారిలో ఉన్నట్టు టాక్. శ్రీకారం చుట్టింది మాత్రం సూర్యనే అని కోలీవుడ్ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఒకరితో మొదలుపెడితే అందరు ఆదర్శంగా తీసుకుని తమ దారిలో వస్తారనేది విశాల్ ఆలోచనగా కనిపిస్తోంది. నిర్మాణ వ్యయం రోజురోజుకి భారమవుతున్న తరుణంలో హీరోలు ఇలాంటివి చేయటం వాళ్ళకు ఎంతో మేలు చేసేవే. ఈ దిశగా అందరు హీరోలు ఆలోచించాలని నిర్మాతలు కోరుతున్నారు.

ఇక సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే దాని గురించి స్పష్టత రావడం లేదు. డిమాండ్ల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామంటున్న నిర్మాతల సమాఖ్యతో ప్రభుత్వం నడిపిన రాయబారం విఫలమైంది. ఇప్పుడు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఏ ప్రతిపాదనతో ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లాగా అక్కడ అంత తేలిగ్గా తేలేలా కనిపించడం లేదు. ఇంకా ఎంత దూరం వెళ్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.