వెంకీ మామ.. అఫీషియల్ లిస్టు వచ్చేసింది

Sat Feb 23 2019 22:23:54 GMT+0530 (IST)

ఒక క్రేజీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయగానే.. ఇక అందులో పని చేసే నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి రకరకాల రూమర్లు వచ్చేస్తాయి. చిత్ర బృందం అధికారికంగా వివరాలు వెల్లడించేవరకు జనాలు ఆగలేరు. తన తమ్ముడు విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యల కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న అగ్ర నిర్మాత సురేష్ బాబు.. ఎట్టకేలకు గత ఏడాది ఈ కలయికలో సినిమా అనౌన్స్ చేశాడు. అప్పట్నుంచి ఈ సినిమా గురించి రకరకాల రూమర్లు వినిపించాయి. ఈ మధ్య ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి పెద్ద చర్చే సాగింది. ఐతే ఇక ఇలాంటి చర్చలకు ఆస్కారం లేకుండా వెంకీ చైతూల సరసన నటించే హీరోయిన్లెవరో అధికారికంగా ప్రకటించేసింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.‘వెంకీ మామ’లో వెంకీ సరసన ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నటించనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తే నిజమైంది. ఆమెనే కథానాయికగా ఖరారు చేశారు. ఇక నాగచైతన్యకు జోడీగా ముందు రకుల్ ప్రీత్ పేరు వినిపించింది. కానీ ఆ పాత్రకు రాశి ఖన్నాను తీసుకున్నారు. ‘పవర్’.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’.. ‘జై లవకుశ’ చిత్రాల దర్శకుడు బాబీ ‘వెంకీ మామ’ను డైరెక్ట్ చేస్తున్నాడు. తన చివరి రెండు సినిమాల సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను కాదని.. తొలి సినిమాకు పని చేసిన తమన్ ను ఎంచుకున్నాడు బాబీ. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు.. నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నాడు. ఆదివారమే ‘వెంకీ మామ’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది.