Begin typing your search above and press return to search.

చైతు కోసం రంగంలోకి దిగిన సురేష్‌ బాబు

By:  Tupaki Desk   |   24 July 2016 1:20 PM GMT
చైతు కోసం రంగంలోకి దిగిన సురేష్‌ బాబు
X
టాలీవుడ్‌ లో ఇటీవ‌ల ఎక్కువ‌గా అక్కినేని నాగ‌చైత‌న్య పేరు వార్త‌ల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌ ను చైతు పెళ్లాడుతున్న‌ట్టు వార్త‌లు జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే చైతు ఇటు దివంగ‌త లెజెండ్రీ హీరో ఏఎన్నార్‌ తో పాటు అటు దివంగ‌త లెజెండ్రీ ప్రొడ్యుస‌ర్ ద‌గ్గుపాటి రామానాయుడుకు కూడా మ‌న‌వ‌డే అన్న సంగ‌తి తెలిసిందే. చైతుకు అటు అక్కినేని - ఇటు ద‌గ్గుపాటి ఈ రెండు కుటుంబాల బ‌ల‌మైన స‌పోర్ట్ ఉంది.

చైతూ ప్ర‌స్తుతం తండ్రి నాగార్జున వ‌ద్దే ఉంటున్నా...చిన్న‌ప్పుడు త‌న తాత రామానాయుడు ఇంట్లోనే ఎక్కువ‌గా పెరిగాడు. రానా - అభిరామ్‌ తో క‌లిసి పెరిగిన చైతు కాస్త పెద్ద‌య్యాకే నాగ్ వ‌ద్ద‌కు వెళ్లాడు. ఇదిలా ఉంటే కేరీర్ ప‌రంగా చైతు ఇంకా స్టార్ స్టేట‌స్ అందుకోలేదు. సినిమాలు చేస్తున్నా చైతుకు స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా బ‌య‌ట బ్యాన‌ర్ల‌లోనే సినిమాలు చేస్తోన్న చైతును ఇప్పటి వ‌ర‌కు తండ్రి నాగార్జునే ప్ర‌మోట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చైతు కోసం మేన‌మామ‌లు సైతం రంగంలోకి దిగారు.

చైతు 2010లో వ‌చ్చిన జోష్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయినా ఇప్ప‌టి వ‌ర‌కు దేశం గ‌ర్వించ‌ద‌గ్గ బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన త‌న తాత స్థాపించిన‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌ లో మాత్రం న‌టించ‌లేదు. అయితే అది త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాలుస్తున్న‌ట్టు తాజా స‌మాచారం ద్వారా తెలుస్తోంది. చైతు హీరోగా త‌మ హోం బ్యాన‌ర్ అయిన సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌ లో ఓ సినిమా రూపొందిస్తున్న‌ట్టు చైతు మేన‌మామ‌ - ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌ బాబు తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఇక త‌మ బ్యాన‌ర్‌ లో ఇటీవ‌ల సినిమాలు రాక‌పోవ‌డంపై సురేష్‌ బాబు మాట్లాడుతూ త‌మ బ్యాన‌ర్‌ కు మంచి ఇమేజ్ ఉంద‌ని, సినిమా రిజ‌ల్ట్ తేడా వ‌స్తే డ‌బ్బుతో పాటు బ్యాన‌ర్ ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌ని, అందుకే త‌మ బ్యాన‌ర్‌ లో నిర్మించే సినిమాల విష‌యంలో ఆచితూచి తానే స్వ‌యంగా క‌థ‌లు ఎంపిక చేసుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. సో ఇప్ప‌టి వ‌ర‌కు అక్కినేని బ్రాండ్‌ తో ప్ర‌మోట్ అవుతున్న చైతుకు ఇక ద‌గ్గుపాటి బ్రాండ్ కూడా జత‌క‌ల‌వ‌నుంది. ఈ రెండు బ్రాండ్ల‌తో అయినా చైతు స్టార్ స్టేట‌స్ సాధిస్తాడేమో చూద్దాం.

ఇక సురేష్‌ బాబు నిర్మాత‌గా చైతు హీరోగా రూపొందే సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా ప్ర‌స్తుతం స్ర్కిఫ్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.