Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూపై సురేష్ బాబు..

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:36 AM GMT
శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూపై సురేష్ బాబు..
X
కొన్ని నెలల కిందట అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ మీద శ్రీరెడ్డి చేసిన ఆరోపణుల.. ఆమె బయటపెట్టిన ఫొటోలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. దీనిపై పెద్ద రగడే నడిచింది. ఐతే దానిపై దగ్గుబాటి కుంటుంబం నుంచి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కొంత కాలం పాటు సురేష్ బాబు అసలు బయటికే రాకుండా ఉండిపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారం సద్దుమణిగాక తన కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రమోషన్ల కోసం ఆయన మీడియా ముందుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఇష్యూపై ప్రశ్నలు ఆగలేదు. శ్రీరెడ్డి-అభిరామ్ వ్యవహారం గురించి మీడియా వాళ్లు ప్రశ్నించారు. ఐతే పేర్లు ఎత్తకుండా ఈ ఇష్యూపై సురేష్ స్పందించారు. ఆయనేమన్నారంటే..

‘‘నా వ్యక్తిగత విషయాలను నేను బయట పంచుకోను. నాపై ఏదైనా వ్యక్తిగతంగా ప్రభావం చూపితే అది నా వ్యక్తిగత సమస్య. దాన్ని నేను సొంతంగా పరిష్కరించుకుంటాను. దాన్ని ప్రజలతో పంచుకోవాలనే ఆసక్తి నాకు లేదు. నాకు మాత్రమే కాదు ప్రతి కుటుంబానికీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. నేను లైమ్ లైట్లోకి వచ్చాను. నాకు సంబంధించిన కొన్ని సమస్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నేను పబ్లిక్ పర్సన్ కాదు. నా వ్యక్తిగత జీవితానికి - నా కుటుంబానికి సంబంధించిన విషయాలు జనాల్లోకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు’’ అని సురేష్ అన్నాడు.

ఇండస్ట్రీ అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిందని.. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమను అందరూ లక్ష్యంగా చేసుకుంటున్నారని సురేష్ అభిప్రాయపడ్డారు. ఒక డైమండ్ వ్యాపారి తప్పుచేస్తే అందరు వ్యాపారులనూ అలాగే చూస్తామా? ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే అందరు రాజకీయ నాయకులను అలాగే చూస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడా అందరూ తప్పుడు మనుషులే ఉండరని.. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు తప్పు చేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుగా చూడటం సరికాదని ఆయనన్నారు. చికాగో సెక్స్ రాకెట్ గురించి ఆయన స్పందిస్తూ.. ‘‘అక్కడ ఏం జరిగింది? వాడు సినిమా వాడా? కాదా? మనకు తెలియదు. మీడియాలో సినిమా ప్రొడ్యూసర్ అని వెంటనే అనౌన్స్ చేశారు. అతడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నారా? లేడా? అనేది ఎవరికీ తెలియదు. వెళ్లిన వారు సినిమా యాక్టర్లా? కాదా? అనేది కూడా తెలియదు. ఛానెళ్లు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు’’ అని సురేష్ అన్నారు.