Begin typing your search above and press return to search.

సైరా యుద్ధ రంగాన్ని చూపించేశారు

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:12 AM GMT
సైరా యుద్ధ రంగాన్ని చూపించేశారు
X
ఇంతకుముందు పాటల కోసమే ఫారిన్ లొకేషన్లకు వెళ్లేవాళ్లు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కానీ ఇప్పుడు సినిమాలోని కీలకమైన ఎపిసోడ్లను విదేశాల్లో తీస్తున్నారు. ఐతే విదేశాల్లో చిత్రీకరణ అన్నది సాధారణమైన విషయం అయిపోవడంతో అక్కడి లొకేషన్లు కూడా జనాలకు అలవాటైపోతున్నాయి. అందుకోసం కొత్త కొత్త దేశాలకు వెళ్లి.. కొత్త కొత్త లొకేషన్లు చూస్తున్నారు. విలక్షణ దర్శకుడు క్రిష్ తన ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు జార్జియాను వేదికగా చేసుకున్నాడు. అక్కడ కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాడు. ‘కంచె’కు కథ రీత్యానే అక్కడికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇక ‘శాతకర్ణి’లోనూ భారీతనంతో కూడుకున్న కొన్ని సీన్స్ అక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇదే బాటలో ‘సైరా నరసింహారెడ్డి’ టీం కూడా జార్జియాకు వెళ్లింది.

అక్కడ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. చుట్టూ కొండలు.. మధ్యలో ఖాళీగా ఉన్న విశాలమైన ప్రదేశాన్ని యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు ఎంచుకున్నారు. ‘సైరా’ 200 ఏళ్ల కిందటి కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ.. ఏమాత్రం ఆధునికత కనిపించని విశాలమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడం అవసరం. ఇలాంటి లొకేషన్లు దొరకడం అంత సులువు కాదు. మన దగ్గర అలాంటివి దొరికినా.. షూటింగుకి అనేక ఇబ్బందులుంటాయి. అందుకే జార్జియాను వేదికగా ఎంచుకున్నట్లుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్ స్పాట్ నుంచి వీడియో తీసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. అక్కడి నుంచి సెల్ఫీ కూడా దిగి పోస్ట్ చేశాడు. పెద్ద పెద్ద టెంట్లు వేసి యాక్షన్ టీం షూటింగుకి సన్నాహాలు చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. లొకేషన్ అయితే మరీ ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదు. మరి తెర మీద దీన్నెలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ఇప్పుడు తీయబోయే వార్ ఎపిసోడ్ కోసం రూ.45 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం