మమ్ముట్టి కాదు..తెరపై రాజన్న కనిపించారు: సురేందర్ రెడ్డి

Mon Feb 11 2019 13:40:38 GMT+0530 (IST)

మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర' 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  డీసెంట్ రివ్యూస్ తో పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఇప్పటికే దర్శకుడు మారుతి.. తమిళ స్టార్ హీరో సూర్య తమ స్పందనను తెలిపారు. కానీ దాదాపు టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ సినిమా గురించి తమ అభిప్రాయం చెప్పకుండా ఏమీ పట్టనట్టు సైలెంట్ గా ఉండడం వైయస్ అభిమానులకు నచ్చడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.  మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా' షూటింగ్ లో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి వీలు చూసుకొని మరీ 'యాత్ర' ను తిలకించారు.  సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు.  "యాత్ర ను చూశాను! అదొక ఎమోషనల్ జర్నీ.  చాలా సందర్భాలలో నేను ఎమోషనల్ అయ్యాను. మమ్ముట్టిగారి బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ కారణంగా సినిమాలో రాజన్నను చూసినట్టే ఉంది.  ఒక అద్భుతమైన.. గౌరవనీయమైన పని చేసినందుకు యాత్ర టీం సభ్యులందరికీ అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.  

'యాత్ర' సినిమాపై స్పందించినందుకు చాలామంది నెటిజనులు సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు రాజకీయ కారణాలతోనే చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.