షూటింగ్ లో రోజూ పవన్ తో గొడవే!

Sun Jul 14 2019 23:00:01 GMT+0530 (IST)

పవన్ తో నటించిన ఏ హీరోయిన్ అయినా సరే.. అతడి గురించి తప్పకుండా చెప్పే రెండు మాటలు.. ఒకటి జెంటిల్ మ్యాన్.. మరొకటి ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని తాము ఎక్కడా చూడలేదని. మిగిలిన హీరోయిన్లు ఒక ఎత్తు అయితే.. ఆయన తొలి రీల్ హీరోయిన్ సుప్రియ వ్యవహారం మరో ఎత్తు. అక్కినేని నాగేశ్వరరావు మనమరాలిగా ఎంట్రీ ఇచ్చిన తన తొలి సినిమాలో పవన్ తో జత కట్టారు.కొన్నేళ్ల విరామం తర్వాత గూఢాచారి చిత్రంతో పోలీస్ ఆఫీసర్ గా కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్న  ఆమె.. తన తొలి సినిమా ముచ్చట్లను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ గురించి ఆమె ఆసక్తికర విషయాలు.. వ్యాఖ్యలు చేశారు. పవన్ తెగ సిగ్గు పడుతుంటేవారని.. అప్పట్లో చాలా ఒత్తిడికి గురయ్యేవారన్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా చేసే సమయంలో తాను రోజూ పవన్ తో గొడవపడేదానన్ని చెప్పారు.

హీరోగా మొదటి సినిమా కావటంతో పవన్ చాలా టెన్షన్ ఫీలయ్యేవారని.. తనకు మాత్రం అలా అనిపించేది కాదన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన వరకూ హీరోలతో ఒక కంప్లైంట్ ఉండేదని.. అప్పట్లో హీరోలకు జుట్టు నొసల వరకూ ఉండేదని.. కళ్లజోడు పెట్టేవారని.. మీసం కూడా పొడువుగా ఉండేదని.. క్లోజప్ పెట్టి.. ఎక్స్ ప్రెషన్ అంటే ఏం కనపడుతుంది?  దీంతో.. హీరో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చారో అర్థం కాక తాను తెల్లబోయేదానినని చెప్పారు.

ఈ కారణంతో షాట్ ఓకే కావటానికి నాలుగైదు టేకులు తీసుకోవాల్సి వచ్చేదని.. లెజెండరీ నటుడు అక్కినేని నట వారసురాలైన మనమరాలు నాలుగైదు టేకులు తీసుకోవటమా? అన్నట్లు చూసే వారన్నారు. దీంతో.. తనకు చాలా కోపం వచ్చేదన్నారు. నువ్వు కళ్లజోడు లేకుండా వచ్చి చేయ్ అంటూ పవన్ తో తాను సరదాగా గొడవపడేదాన్ని అంటూ పాత విషయాల్ని చెప్పుకొచ్చారు.