Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: సుప్రీమ్

By:  Tupaki Desk   |   5 May 2016 10:42 AM GMT
మూవీ రివ్యూ: సుప్రీమ్
X
చిత్రం : సుప్రీమ్

నటీనటులు: సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా - మాస్టర్ గాంధీ - సాయికుమార్ - రాజేంద్రప్రసాద్ - కబీర్ సింగ్ - రవికిషన్ - వెన్నెల కిషోర్ - పృథ్వీ - ప్రభాస్ శీను - పోసాని కృష్ణమురళి - శ్రీనివాసరెడ్డి - రఘుబాబు - తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్
నిర్మాత: శిరీష్
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అనిల్ రావిపూడి

దిల్ రాజు సంస్థకు ఆస్థాన కథానాయకుడిగా మారిపోయాడు సాయిధరమ్ తేజ్. వరుసగా అతడి మూడో సినిమా కూడా అదే బేనర్ లోనే తెరకెక్కింది. ‘పటాస్’ సినిమా ప్రివ్యూ షో చూసి అనిల్ రావిపూడి టాలెంట్ పసిగట్టేసిన దిల్ రాజు.. ఆ సినిమాను తనే రిలీజ్ చేయడమే కాదు.. వెంటనే అతడికి తన బేనర్ లో అవకాశమిచ్చాడు. ఇలా సాయిధరమ్-అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘సుప్రీమ్’. కాంబినేషన్ క్రేజ్ తో మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అనంతపురంలో వేలాది మంది ‘జాగృతి’ అనే ట్రస్టును నమ్ముకుని వేలాది మంది రైతులు బతుకుతుంటారు. ఆ ట్రస్టు కింద ఉన్న భూముల మీద విక్రమ్ సర్కార్ (కబీర్ సింగ్) అనే దుర్మార్గుడి కళ్లు పడతాయి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూముల్ని తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఐతే భూములు ట్రస్టుకే సొంతమని రుజువు చేసే ఒరిజినల్ డాక్యుమెంట్లు తేవడానికి కోర్టు నుంచి నెల రోజుల గడువు తీసుకుంటాడు ట్రస్టీ (సాయికుమార్). మరోవైపు ఈ భూముల్ని ట్రస్టుకు దానం చేసిన జమీందారీ కుటుంబానికి వారసుడైన రాజన్ (మాస్టర్ గాంధీ).. అనుకోకుండా బాలు (సాయిధరమ్) అనే ట్యాక్సీ డ్రైవర్ని కలిసి అతడికి దగ్గరవుతాడు. రాజన్ కోసం వెతుకుతున్న సర్కార్ మనుషులు అతణ్ని తన దగ్గర్నుంచి దౌర్జన్యంగా ఎత్తుకెళ్లిపోయాక బాలుకు అసలు విషయం తెలుస్తుంది. మరి బాలు.. రాజన్ ను ఎలా కాపాడ్డానికి ఏం చేశాడు.. డాక్యుమెంట్లతో సహా అతణ్ని అనుకున్న సమయానికి కోర్టు ముందు ప్రవేశ పెట్టాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘పటాస్’ సినిమాతో కమర్షియల్ సినిమాను ఎలా డీల్ చేయాలో చూపించాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. కథనం కూడా మరీ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ సినిమా ఆద్యంతం జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎంటర్టైన్మెంటే ఆ సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించేస్తే కథ రొటీన్ గా ఉన్నా.. కొత్తదనం లేకపోయినా.. పెద్దగా పట్టించుకోకుండా జనాలు సినిమాను ‘పాస్’ చేసేస్తారని ‘పటాస్’తో చూపించిన అనిల్ రావిపూడి.. దర్శకుడిగా ద్వితీయ విఘ్నాన్ని దాటడానికి కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. మెగాస్టార్ ‘పసివాడి ప్రాణం’ తరహాలో మెగా మేనల్లుడి కోసం ఓ చైల్డ్ సెంటిమెంట్ బేస్డ్ కథ రాశాడతను.

ఒక మామూలు కథను తనదైన శైలిలో ఎంటర్ టైనింగ్ గా చెప్పడానికి ప్రయత్నించాడతను. ‘పటాస్’ తరహాలోనే అనిల్ ఎంటర్ టైన్ మెంట్.. యాక్షన్ కు ఢోకా లేకుండా చూసుకున్నాడు. ఐతే అనిల్ తొలి సినిమా స్థాయిలో ఇందులో డోస్ లేదు.. ‘సుప్రీమ్’ ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేస్తుంది. పైసా వసూల్ సినిమాలా అనిపిస్తుంది. ‘సుప్రీమ్’ కథ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అందులో ఏ విశేషం లేదు. చాలా రొటీన్ కథ ఇది. మొదలైన 15 నిమిషాలకే ప్రేక్షకుడికి సినిమా మీద ఓ అంచనా వచ్చేస్తుంది. విలన్ వెతుకుతున్న వారసుడు హీరోయేనేమో అని భ్రమలు కల్పించేలా కొంత సస్పెన్స్ మెయింటైన్ చేయడమొక్కటే ‘సుప్రీమ్’ కథలో ఉన్న విశేషం. ఐతే ఇంటర్వెల్ ముందు అది కూడా రివీల్ అయిపోతుంది. ఇక ద్వితీయార్ధంలో అయితే తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఏమీ ఉండదు. ఫ్లాట్ గా ప్రేక్షకుడి అంచనాల ప్రకారం సినిమా సాగిపోతుంది. సినిమాలో చాలా వరకు కథనం ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లుగా నడుస్తుంది.

ఐతే ‘సుప్రీమ్’కు ప్రధాన ఆకర్షణ ప్రథమార్ధమే. ఇందులో వచ్చే కామెడీనే. హీరోయిన్ పాత్ర చుట్టూ పండించిన వినోదం ఫస్టాఫ్ అంతా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర నామమాత్రంగా ఉంటుంది కానీ.. ‘సుప్రీమ్’లో మాత్రం హీరోయిన్ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పోలీస్ టెస్టులన్నింట్లో ఫెయిలై లంచం ఇచ్చిన ఉద్యోగం సంపాదించిన ఎస్సై పాత్రలో రాశి ఖన్నా బాగానే ఫిట్టయింది. హీరో-హీరోయిన్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలన్నీ అలరిస్తాయి. ఇక కారు దొంగలుగా పృథ్వీ-ప్రభాస్ శీను జంట పండించిన కామెడీ కూడా బాగానే వర్కవుటైంది. మరోవైపు కామెడీ విలన్ గా రవికిషన్.. అతడి అసిస్టెంటు మధ్య నడిచే కామెడీ ట్రాక్ కూడా బాగానే నవ్విస్తుంది.

ఇలా వేర్వేరు కామెడీ ట్రాకులతో ఎంటర్టైన్ చేస్తూ ప్రథమార్ధాన్ని వేగంగా నడిపించాడు అనిల్. దర్శకుడు మళ్లీ అసలు కథలోకి వెళ్లే వరకు ‘సుప్రీమ్’ బాగానే టైంపాస్ చేసేస్తుంది. ఐతే ఇంటర్వెల్ ముందు హీరో వెంట ఉండే పిల్లోడి కథేంటో రివీల్ అయ్యే వరకు ఆసక్తికరంగా నడిచిన కథనం.. అసలు సంగతి రివీల్ అయ్యాక చాలా మామూలుగా సాగిపోతుంది. ద్వితీయార్ధం సాగతీతే. కథ పరంగా ఏ ఎగ్జైట్మెంట్ లేకపోగా.. ద్వితీయార్ధంలో కామెడీ డోస్ కూడా తగ్గిపోయింది. యాక్షన్ ప్రియుల్ని అలరించే ఫైట్లు.. ఓ మోస్తరు కామెడీతో ఏదో అలా అలా ద్వితీయార్ధాన్ని నడిపించారు. ద్వితీయార్ధంలో హీరో పాత్రకు ప్రాధాన్యం తగ్గించేసి.. పిల్లోడి పాత్రను హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు.

పిల్లాడి పాత్ర.. ఆ పిల్లాడి చురుకుదనం.. పిల్లాడి చురుకుదనం.. క్యూట్ నెస్.. ఆ పాత్రతో పండించిన సెంటిమెంటు.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు. ఐతే సెంటిమెంటు కోసం సన్నివేశాల్ని మరీ డ్రమటిగ్గా తయారు చేశారు. అంత చిన్న పిల్లోడు అంత మెచ్యూర్డ్ గా ప్రవర్తించడం కూడా అతిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే వికలాంగుల ఫైట్ కూడా టూమచ్ గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మామూలుగానే ఉంటుంది కానీ.. కామెడీ క్యారెక్టర్లన్నింటినీ ఒకచోటికి తెచ్చి సినిమాను సరదాగా ముగించడం బాగుంది. చివరి సన్నివేశాలు చూస్తే.. మళ్లీ ప్రథమార్ధంలో కామెడీ గుర్తుకొచ్చి నవ్వుకుంటూ బయటికి వస్తాడు ప్రేక్షకుడు. ద్వితీయార్ధంలో కూడా ఇలాగే వినోదం పండి ఉంటే.. సుప్రీమ్ రేంజి మరోలా ఉండేది.

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ ఎప్పట్లాగే హుషారుగా కనిపించాడు. అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ కావడంతో ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఐతే సాయిధరమ్ కు యాక్టింగ్ పరంగా సవాలు విసిరే సన్నివేశాలేమీ లేవు ఇందులో. డ్యాన్సులు.. ఫైట్లు బాగా చేశాడు. అందం హిందోళం పాటలో చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా డ్యాన్సులేశాడు. ఐతే సాయిధరమ్ నుంచి ఇంకా బెటర్ డ్యాన్సులే ఆశించి ఉంటారేమో మెగా అభిమానులు. సినిమాలో తేజ్ పాత్రకు ప్రాధాన్యం తక్కువే. ప్రథమార్ధంలో హీరోయిన్.. ద్వితీయార్ధంలో పిల్లోడి పాత్రలు సాయి క్యారెక్టర్ని డామినేట్ చేశాయి.

హీరోయిన్ రాశి ఖన్నా పాత్రకు తగ్గట్లుగా బాగానే నటించింది. ఆమె కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. కథలో కీలకమైన పాత్రలో మాస్టర్ గాంధీ ఆకట్టుకున్నాడు. ఆ పిల్లాడు హావభావాలు చాలా బాగా పలికించాడు. విలన్ కబీర్ సింగ్ గురించి చెప్పడానికేమీ లేదు. అతడి కంటే కామెడీ విలన్ గా రవికిషన్ పాత్ర.. అతను పండించిన వినోదం ఆకట్టుకుంటాయి. కారు దొంగలుగా పృథ్వీ-ప్రభాస్ శ్రీను బాగా నవ్వించారు. సంగీత విధ్వాంసులుగా పోసాని-శ్రీనివాసరెడ్డి పర్వాలేదు. రఘుబాబు కామెడీ పండింది. సాయికుమార్.. రాజేంద్ర ప్రసాద్ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతికవర్గం:

సాయికార్తీక్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. పాటల్లో ఏవీ ప్రత్యేకంగా అనిపించవు. అందం హిందోళం ఒక్కటే గుర్తుంచుకోదగ్గది. అది కూడా పాత ట్యూనే. డ్యాన్సులేసుకోవడానికే పాటలు తప్ప.. థియేటర్ నుంచి బయటికొచ్చాక గుర్తొచ్చే పాటలేమీ లేవు. పాటల చిత్రీకరణ కూడా అంతంతమాత్రమే. ఎంతో గొప్పగా చెప్పుకున్న అందం హిందోళం పాట కూడా మామూలుగానే అనిపిస్తుంది. సాయికార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. పాటల కోసం బాగా ఖర్చు పెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి రెండో సినిమాకు కూడా తన బలాన్నే నమ్ముకున్నాడు. కామెడీ.. యాక్షన్.. మీద తనకున్న పట్టును మరోసారి చూపించాడు. ఐతే కథ విషయంలోనే మరీ ఇలా రొటీన్ గా లాక్కొచ్చేయాలనుకోవడం నిరాశ పరుస్తుంది. అనిల్ రాసిన మాటలు బాగున్నాయి. కామెడీ డైలాగులు చాలానే పేలాయి.

చివరగా: సుప్రీమ్.. ‘రొటీన్’గానే ఎంటర్టైన్ చేశాడు

రేటింగ్: 2.75/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre