Begin typing your search above and press return to search.

నా కూతురిలో ఇంత టాలెంటుందని తెలియదు

By:  Tupaki Desk   |   13 Dec 2017 10:30 AM GMT
నా కూతురిలో ఇంత టాలెంటుందని తెలియదు
X
తన కూతురు మంజుల దర్శకురాలిగా మారడం పట్ల సూపర్ స్టార్ కృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెలో ఈ టాలెంట్ ఉందని తాను ఎప్పుడూ గుర్తించలేదని.. మంజుల ఆ రకంగా తనకు ఎప్పుడూ కనబడలేదని ఆయన అన్నారు. ‘మనసుకు నచ్చింది’ సినిమా గురించి తనకు ఏ సమాచారం లేదని.. తాను ఈ సినిమా చూడలేదని.. ఐతే అందరూ దీని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

‘‘మా మంజుల ఉన్నట్లుండి ఒక రోజు నా దగ్గరికి వచ్చి తాను ఒక కథ రెడీ చేసుకున్నానని.. దర్శకత్వం చేయబోతున్నానని.. జెమిని కిరణ్ గారు ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారని చెప్పింది. నేను చాలా థ్రిల్లయ్యాను. ఎందుకంటే తనకు ఆ ఆలోచనలు ఉన్నట్లుగా ఆమె నా ముందు ఎప్పుడూ కనబడలేదు. జెమిని కిరణ్ లాంటి పెద్ద నిర్మాతను ఒప్పించి సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. అంత మంచి నిర్మాతను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది.

మంజుల కథ రాయడమే కాకుండా ఇంగ్లిష్ లో డైలాగులు కూడా రాసుకుందని.. వాటిని తాను తెలుగులోకి అనువదించానని.. స్క్రిప్టు చాలా బాగుందని సాయిమాధవ్ బుర్రా గారు చెప్పారు. డైలాగులు కూడా తనే రాసిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ సినిమా కథేంటో నాకు తెలియదు. రాఘవేంద్రరావు గారు ఇందులో రెండు పాటలు కూడా చూశానన్నారు. కానీ నాకు మాత్రం ఏమీ చూపించలేదు. నేరుగా ఫస్ట్ లుక్ టీజర్ చూశాను. చాలా బాగుంది. మనసుకు నచ్చింది అనేది చాలా మంచి టైటిల్. జనాలందరికీ ఈ సినిమా నచ్చాలి. సూపర్ హిట్టవ్వాలి. మీడియా వాళ్లు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నా’’ అని కృష్ణ అన్నారు.