సూపర్ స్టార్ కష్టం మాటల్లో చెప్పలేం

Thu Jun 27 2019 14:37:49 GMT+0530 (IST)

గత రెండు దశాబ్దాలకు పైగా సూపర్ స్టార్ కృష్ణ గారిని విజయ నిర్మల గారు పక్కన లేకుండా చూసిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పాలి. అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంటలో ఒకరు ఇకపై ఒంటరిగా జీవించాలన్నా ఊహే అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విజయనిర్మల గారు ఊహించని విధంగా ఇవాళ హఠాన్మరణం చెందటం పరిశ్రమ సైతం జీర్ణించుకోలేకపోతోంది.భౌతిక కాయం నానక్ రామ్ గూడలోని స్వగృహానికి తెచ్చినప్పుడు దిగాలుగా కుర్చీలో కూర్చున్న కృష్ణ గారు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏడుస్తూ ఉంటె మహేష్ బాబు సైతం ఎలా ఓదార్చాలో అర్థం కాక విషణ్ణ వదనంతో మౌనంగా ఉండిపోయాడు. దాంతో ఆ బాధ్యత తీసుకున్న నమ్రత శిరోద్కర్ మావయ్య కృష్ణ గారి వెనకాలే ఉంటూ భుజం తడుతూ ఆయన కన్నీరు పెడుతున్న ప్రతిసారి ధైర్యం చెప్పడం కనిపించింది

కృష్ణ గారు వయసురిత్యా ఈ మధ్య ఎక్కువగా బయటికి రావడం లేదు. మహర్షి అంత పెద్ద హిట్ అయినా ప్రీ రిలీజ్ లో కానీ సక్సెస్ మీట్ కు కానీ రాలేకపోయారు. తన పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోరిక మేరకు విజయ నిర్మల గారి సహకారంతో కేక్ కటింగ్ చేసి జరుపుకున్నారు. ఇప్పుడు ఆయన ఒంటరి మనిషి అయిపోవడంతో ఫ్యాన్స్ ఈ విషయంగానే కలవరపడుతున్నారు.

ఎలాంటి సమస్య వచ్చినా ఇబ్బంది కలిగినా తన పక్కన విజయ నిర్మల ఉందన్న ధైర్యంతో ఒకరికి ఒకరుగా ఉన్న కృష్ణ ఇకపై మానసిక భారాన్ని తానొక్కరే మోయాలి. కాలం చేసిన గాయం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులే కాదు సినిమా ప్రేమికులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.