మంజుల ఎపిసోడ్ పై కృష్ణ స్పందించాడు

Sun Jun 18 2017 15:42:56 GMT+0530 (IST)

ఇప్పుడైతే సినీ ఫ్యామిలీలకు చెందిన అమ్మాయిలు హీరోయిన్లు కావాలనుకుంటే అడ్డు చెప్పేవాళ్లెవ్వరూ కనిపించట్లేదు. మంచు లక్ష్మి.. నిహారిక.. ఇలా చాలామందే ఈ మధ్య కాలంలో హీరోయిన్లయ్యారు. ఐతే ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. హీరోల కూతుళ్లు హీరోయిన్లవుతామంటే అభిమానులు అంగీకరించేవాళ్లు కాదు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల విషయంలో ఆయన అభిమానులు అప్పట్లో అదే చేశారు. ఆమె హీరోయిన్ అవుతానంటే తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మంజు సినిమా కలలకు బ్రేక్ పడింది. దీనిపై కృష్ణతో పాటు మంజుల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.

అప్పటి అభిమానుల ప్రవర్తనపై కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మా అభిమానులు నాతో ఉన్న ఆత్మీయతతోనే వద్దన్నారు. మంజులని వాళ్ల సొంత చెల్లెలిలాగా చూసుకున్నారు కాబట్టి ‘మా చెల్లెలు వాడితోనో వీడితోనో యాక్ట్ చేయడానికి వీల్లేదు’ అని అన్నారు. ఈ మాట ఒక ఊరు కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి వినిపించింది. అప్పుడు మంజులతో మాట్లాడాను. ‘నటన ఎందుకులే.. అభిమానులు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అయినా వాళ్ల మాటను కాదని యాక్ట్ చేసి వాళ్లను హర్ట్ చేయడం ఎందుకు’ అని ఇద్దరం అనుకున్నాం’’ అని కృష్ణ తెలిపాడు. తాను సినిమాల్లోకి వస్తానంటే తన తండ్రి ఎప్పుడూ వద్దనలేదని.. నిర్ణయాన్ని తనకే వదిలేశారని.. ఐతే అభిమానుల గురించి.. మన కల్చర్ గురించి చెప్పడంతో అర్థం చేసుకుని హీరోయిన్ అయ్యే ఆలోచనను వదులుకున్నానని మంజుల తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/