Begin typing your search above and press return to search.

సమంత ట్రైలర్.. టాక్ ఆఫ్ ద సౌత్

By:  Tupaki Desk   |   23 Feb 2019 4:49 AM GMT
సమంత ట్రైలర్.. టాక్ ఆఫ్ ద సౌత్
X
దక్షిణాదిన బహు భాషల్లో ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. ఆమె తెలుగులోనే కాదు.. తమిళంలోనూ టాప్ హీరోయిన్. పెళ్లయ్యాక కూడా ఏమాత్రం జోరు తగ్గించకుండా దూసుకెళ్తున్న సమంత.. తమిళంలో ‘సూపర్ డీలక్స్’ అనే సినిమాతో రెడీ అయింది. ఈ చిత్ర ట్రైలర్ శుక్రవారమే లాంచ్ చేశారు. ఆరంభం నుంచి చివరి వరకు చాలా కొత్తగా సాగిన ఈ ట్రైలర్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా కథేంటో అర్థం కాలేదు కానీ.. దాన్ని ఒక పిట్ట కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. అది ఒక పజిల్ లాగా ఉంది. నటుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన విజయ్ సేతుపతి ఇందులో ఆడవేషంలో కనిపించనుండటం విశేషం. ట్రైలర్‌ ను నరేట్ చేసింది కూడా అతనే. దర్శకుడు ఎంచుకున్న ట్రైలర్ కాన్సెప్టే చాలా వినూత్నంగా - ఉత్కంఠ భరితంగా ఉంటే.. విజయ్ సేతుపతి నరేషన్‌ తో అది మరింత ఆకర్షణీయంగా మారింది.

విజయ్ - సమంతలతో పాటు ఫాహద్ ఫాజిల్ - రమ్యకృష్ణ లాంటి మంచి నటులుండటం.. ఇంకా చాలా క్యారెక్టర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ చిత్ర దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా తీసిన తొలి సినిమా ‘ఆరణ్యకాండం’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ సినిమా వచ్చిన ఐదేళ్ల తర్వాత కుమార్ రాజా ఈ చిత్రం తీశాడు. అతను ఎంతో కసరత్తు చేసి మరో వైవిధ్యమైన సినిమా తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మ్యూజిక్ - సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. మామూలు ప్రేక్షకులే కాక సినీ ప్రముఖులు చాలామంది ఈ ట్రైలర్‌ ను ఆకాశానికెత్తేస్తున్నారు. సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మార్చి 29న ‘సూపర్ డీలక్స్ ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా విడదులయ్యే అవకాశాలున్నాయి.