సన్నీ లియోన్ అరుదైన ఘనత

Fri Jan 19 2018 16:59:00 GMT+0530 (IST)

సినిమా తారలు ఎంత పేరు - డబ్బు సంపాదించుకున్నా వారికంటూ కొన్ని ప్రత్యేకమైన గోల్స్ ఉంటాయి. ఉదాహరణకు హాలీవుడ్ మూవీలో నటించడం ఆస్కార్ అవార్డు తెచ్చుకోవడం లాంటివి. ఇవి నెరవేరడం అంత ఈజీ కాకపోయినా ఆశపడటంలో తప్పు లేదు కాబట్టి వీటి మీద మనుసు పారేసుకుంటూ ఉంటారు. అలాంటి లక్ష్యాల్లో మరొకటి మేడం టుస్సాడ్ మ్యూజియంలో మనదంటూ ఒక మైనపు బొమ్మ కలిగి ఉండటం. లండన్ లో ఉన్న ఈ మ్యూజియంని ఏటా కొన్ని కోట్ల ప్రజలు సందర్శిస్తారు. ఇప్పుడు దీన్ని ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఎవరిదైనా విగ్రహం ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ వృత్తిలో గొప్పగా ఏదైనా సాధించినవాళ్ళు అశేషమైన ప్రజల మెప్పు పొందినవాళ్ళు. ఎవరికి సాధ్యం కాని ఘనతను సాధించినవాళ్ళు ఇలా కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.బాలీవుడ్ శృంగార దేవత సన్నీ లియోన్ ఇప్పుడు తన విగ్రహాన్ని అందులో ప్రతిష్టించుకునే అర్హత సాధించింది. ఢిల్లీలో ఏర్పాటు చేయబోయే మేడం టుస్సాడ్ మ్యుజియంలో సన్నీ లియోన్ మైనపు బొమ్మను పెట్టనున్నారు. ఇది తయారు చేయబోయే టీం నుంచి కొందరు నిపుణులు లండన్ నుంచి వచ్చి సన్నీ లియోన్ శరీరానికి సంబంధించిన కొలతలు ఫోటోలు 200 దాకా తీసుకోబోతున్నారు. అన్ని ఎందుకు అంటారా. ఆ స్టాచ్యు ప్రత్యేకత అదే. పక్కన నిలబడితే ఏది విగ్రహమో ఎవరు మనిషో గుర్తు పట్టలేనంత సజీవంగా ఉంటాయి అవి. ఇది తెలిసినప్పటి నుంచి సన్నీ లియోన్ చాలా ఉద్విగ్నభరితంగా ఉంది.

ఇప్పటిదాకా ఢిల్లీ టుస్సాడ్ లో ఉండబోయే వాటిలో కరీనా కపూర్ - కత్రినా కైఫ్ - కపిల్ దేవ్ - సచిన్ టెండూల్కర్ - మాధురి దీక్షిత్ - కత్రినా కైఫ్ - సల్మాన్ ఖాన్ - రన్వీర్ కపూర్ - ఎపిజె అబ్దుల్ కలాం - ఆశా భోంస్లే లతో పలువురు విదేశీ ప్రముఖుల విగ్రహాలు కూడా ఉండబోతున్నాయి. వీరి మధ్య సన్నీ లియోన్ ఉండటం అంటే చిన్న విషయం కాదుగా. గూగుల్ లో అదే పనిగా అందరు సెర్చ్ చేసిన టాప్ మోస్ట్ సెలబ్రిటీగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేసిన సన్నీకి ఈ మాత్రం గుర్తింపు దక్కడం న్యాయమే అంటున్నారు ఫ్యాన్స్.